భారతీయ సాంప్రదాయాన్ని గుర్తుచేసిన నటి..! నౌవారీ చీర, ముక్కు పుడకతో అదరగొట్టిన బ్యూటీ!
ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచమంతా ‘కేన్స్’ నామస్మరణతో ఊగిపోతోంది. పేరుకి ఇది అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అయినప్పటికీ, ప్రపంచ దేశాల దృష్టి మొత్తం సెలెబ్రిటీల నూతన దుస్తులు, రెడ్ కార్పెట్ మీద వారి అలంకరణ తదితర అంశాలపైనే ఉంటుంది. ఈ ప్రపంచ వేదికపై చూపుతిప్పుకోని విధంగా కనిపించేందుకు తారలు కొన్ని నెలల ముందు నుంచే ప్రత్యేక శ్రద్ధతో సన్నద్ధమవుతుంటారు.

సాధారణంగా కేన్స్ రెడ్ కార్పెట్ అనగానే అందరికీ మెరిసే లాంగ్ గౌనులు, వింత వింత పాశ్చాత్య స్టైలిష్ వేర్‌లే గుర్తుకొస్తాయి. కానీ, ఈసారి భారతీయ డిజైనర్లు మరియు తారలు మన దేశీయ సంప్రదాయ వారసత్వానికే పెద్దపీట వేశారు. రంగురంగుల గౌన్ల మధ్య మన సంస్కృతిని ప్రతిబింబించేలా అడుగులు వేస్తున్నారు.
తాజాగా ఆ కోవలోకి మరాఠి నటి ప్రజక్తా మాలి చేరిపోయారు. ఈ ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఆమె మహారాష్ట్ర సంస్కృతిని సగర్వంగా ప్రదర్శించారు. వెస్ట్రన్ దుస్తుల హడావుడిలో కొట్టుకుపోకుండా, తన మూలాలను చాటి చెప్పేలా సాంప్రదాయ నీలి రంగు ‘నౌవారీ చీర’లో (Nauvari Saree) మెరిసిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. రిచ్ బ్లూ మరియు పర్పుల్ రంగుల అద్భుత మేళవింపుతో ఉన్న ఆ మహారాష్ట్ర ప్రత్యేక చేనేత చీరలో ఆమె వయ్యారంగా నడుస్తూ వస్తుంటే, అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆమె వైపు తిరిగింది.
సంప్రదాయ ఆభరణాలు..
ప్రజక్తా మాలి కేవలం చీర కట్టుకోవడమే కాకుండా, మహారాష్ట్ర సాంస్కృతిక గర్వాన్ని ఎలుగెత్తి చాటేలా తన ఆహార్యాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ లుక్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా జుట్టును చక్కగా ముడివేసి, మరాఠీ శైలి చంద్రవంక బిందీని ధరించారు. మహారాష్ట్ర సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే ప్రత్యేకమైన ముక్కుపుడక (మరాఠీ నాథ్), మెడలో చోకర్, చేతులకు నిండుగా గాజులు మరియు నడుముకు కమర్‌బంద్ (వడ్డాణం) వంటి యాక్సెసరీలు ధరించి రాజకుమారిలా కనిపించారు. మరాఠి సంప్రదాయంలోని రాజసమైన లుక్‌ను ఆమె కేన్స్ వేదికపై పునఃసృష్టి చేశారు.
View this post on Instagram
అంతేకాకుండా, రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు ప్రజక్తా కెమెరాలకు ఇరుచేతులు జోడించి ‘నమస్తే’ అంటూ భారతీయ పద్ధతిలో అభివాదం చేశారు. ఆ ఫోజులు ఆమెలోని ఆత్మీయతను, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. విదేశీ ఫోటోగ్రాఫర్ల ముందు మన సంస్కృతిని అంత గౌరవంగా ప్రదర్శించడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
గర్వకారణమైన క్షణం
ఈ విధంగా ప్రపంచ వేదికపై సగర్వంగా భారతీయతను చాటడం ముఖ్యంగా మరాఠీ ప్రేక్షకులను ఎంతోగానో అలరించడమే కాకుండా, దేశ ప్రజలందరూ గర్వించే క్షణంగా మారింది. ఫ్యాషన్ అంటే కేవలం పశ్చాత్య దేశాలను అనుకరించడం కాదు, మన సొంత మూలాలను గౌరవించడం అని ఆమె నిరూపించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్‌కార్పెట్‌పై తన అరంగేట్రం చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “సాంప్రదాయ నౌవారీ చీర, మరాఠీ నాథ్‌తో కేన్స్‌లో నడవడం నాకు ఎంతో గర్వంగా ఉంది” అని పోస్ట్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
భారీ మోడ్రన్ గౌన్లు, అత్యాధునిక డిజైనర్ వస్త్రాల మధ్య ప్రజక్తా మాలి ధరించిన ఈ సంప్రదాయ నౌవారీ చీర అత్యంత బలమైన ముద్ర వేసింది. మన దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో అద్భుతమైన వస్త్ర సంస్కృతి ఉంది. వాటిని ఇలాంటి అంతర్జాతీయ వేదికల పైకి తీసుకెళ్లినప్పుడే మన హస్తకళల గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. కేన్స్ వేదికపై భారతీయ చేనేత మరియు సంస్కృతి జెండాను ఎగురవేసిన ఈ మరాఠీ బ్యూటీని సోషల్ మీడియా వేదికగా ఫ్యాషన్ ప్రియులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
