Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.5 వేలు రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే కొంతమందికి ఈ డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారేమోనని టెన్షన్ పడుతున్నారు. కొన్ని కారణాల వల్ల నిధులు ఆగిపోవచ్చు.

ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. శనివారం రోజున పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేశారు. లబ్దిదారులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున విడుదల చేశారు. ఇక పీఎం కిసాన్ కింద మరో రూ.2 వేలు అకౌంట్లో జమ అయ్యాయి. దీంతో ఏపీలోని రైతుల అకౌంట్లలో ఒకేసారి రూ.7 వేలు జమ అయ్యాయి. అయితే సాంకేతిక కారణాలు, సమస్యల వల్ల లబ్దిదారులకు డబ్బులు అందకపోతే ఏం చేయాలనేది చాలామంది తెలియదు. దీంతో అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా మీరే సమస్యను పరిష్కరించుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.
ఈ తప్పుల వల్ల ఆగిపోయే అవకాశం
-ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోవడం
-ఈకేవైసీ పూర్తి చేయకపోవడం
-ల్యాండ్ రికార్డుల్లో తప్పులు ఉండటం
-ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోకపోవడం
-మీ బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పీసీఐ లింకింగ్ లేకపోవడం
-పేర్లు తప్పుగా నమోదు కావడం
-లబ్దిదారుడికి అర్హత లేకపోవడం వల్ల లబ్దిదారుల జాబితా నుంచి తొలిగించడం
సమస్యను ఎలా పరిష్కరించుకోవాలంటే..?
రైతు సర్వీస్ సెంటర్ లేదా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లండి. బయోమెట్రిక్ విధానంలో ఈకేవైసీ పూర్తి చేయండి. ఇక బ్యాంకుకు వెళ్లి బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. ఇక పట్టా పేరు, సర్వే నెంబర్లు తప్పుగా ఉంటే రెవెన్యూ అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి. ఇంకా సమస్య ఉంటే గ్రామ, వార్డు సచివాలయం అధికారులను సంప్రదించండి. ఇక పీఎం కిసాన్ డబ్బులు పడకపోతే పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తే నిలిచిపోయిన మీ డబ్బులు వారం రోజుల్లో మీ అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది.
