Lata Mangeshkar: ఆయన తన వెంట పడుతున్నారనుకున్నా లతాజీ.. మధురగాయని జీవితంలో అసక్తికర సన్నివేశం
Lata Mangeshkar: మధుర గాయని లతా మంగేష్కర్ మరణంతో ఆమె జీవితంలో పలు ఆసక్తికరమైన పలు విషయాలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి సరదా సన్నివేశం ఒకటి లతాజీ జీవితంలో చోటు చేసుకుంది..

Lata Mangeshkar: మధుర గాయని లతా మంగేష్కర్ మరణంతో ఆమె జీవితంలో పలు ఆసక్తికరమైన పలు విషయాలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి సరదా సన్నివేశం ఒకటి లతాజీ జీవితంలో చోటు చేసుకుంది. దీనిని స్వయంగా’ లతా మంగేష్కర్ : ఇన్‌హర్ వాయిస్’ అనే పుస్తకంలో పంచుకున్నారు. అదేంటంటే.. ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్, లతా మంగేష్కర్ కలిసి పాడిన ఎన్నో అద్భుతమైన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. అయితే వీరిద్దరి మధ్య తొలి పరిచయం జరిగిన తీరు అచ్చం ఓ సినిమా సన్నివేశాన్ని తలపిస్తుంది. కిశోర్ గాయకుడు అని తెలియని లతాజీ ఆయన తన వెంట పడుతున్నారని పొరపాటుపడ్డారట. ‘‘లతాజీ ముంబయిలో గ్రాంట్ రోడ్డు నుంచి బాంబే టాకీస్ స్టూడియో ఉన్న మలద్‌కు లోకల్ ట్రైన్లో వెళ్తుండేవారట. ఓరోజు కిశోర్‌జీ కూడా రైలెక్కారట. ఆయన లతాజీకి కాస్త దగ్గర్లో కూర్చున్నారట. అప్పటికి ఆయన ఎవరో లతాజీకి తెలియకపోయినా , బాగా తెలిసిన వ్యక్తిలాగే అనిపించారట. ఆ తర్వాత లతాజీ మలద్‌లో ట్రైన్ దిగగా ఆయన కూడా అక్కడే దిగారట. అక్కడి నుంచి స్టూడియోకు టాంగాలో వెళ్తున్న లతాజీ వెనకే కిషోర్ జీ కూడా టాంగాలో రావడం చూసి… ఆయన తన వెంట పడుతున్నారన్న అనుమానం కలిగిందట.
టాంగా దిగి స్టూడియో లోపలికి వెళ్తున్న లతాజీ వెంట ఆయనా వెళ్లడంతో..నా అనుమానం బలపడింది. అక్కడ ‘జిద్ది’ సినిమాకు పాటను రికార్డు చేయడానికి సిద్ధంగా ఉన్న సంగీత దర్శకుడు ఖేంచంద్ ప్రకాశ్‌కు ఈ విషయం చెప్పారట లతాజీ. ‘అంకుల్ ఆ కుర్రాడు ఎవరు? నా వెంటే వస్తున్నాడు’ అని ఫిర్యాదు చేశారట. అప్పుడు ఆయన గట్టిగా నవ్వి అసలు విషయం చెప్పారట. ఆయన పేరు కిశోర్‌కుమార్ అని, గాయకుడని, ఈ స్టూడియో యజమాని అయిన ప్రముఖ నటుడు అశోక్ కుమార్‌కు సోదరుడని చెప్పారట. అప్పుడు తెలిసిందట తనతోపాటు ఆరోజు పాట పాడడానికి ఆయన వచ్చారని. లతాజీ ఈ సంఘటన గుర్తుచేసుకుని నవ్వుకునేవారట. ఆతర్వాత వారిద్దరి ద్వయంలో ఆలపించిన పాటలకు మంచి పేరొచ్చింది.




