పీఎం మోడీకి భద్రత కల్పించకపోవడంపై మండిపడిన కంగనా.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ విమర్శలు
Kangana Ranaut: కంగనా రనౌత్ చాలా సందర్భాలలో భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Kangana Ranaut: కంగనా రనౌత్ చాలా సందర్భాలలో భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాజాగా ఈ నటి పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతలో లోపంపై మండిపడింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొంది. అంతే కాదు పంజాబ్‌లో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని వాటిని అరికట్టకపోతే దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపింది. బుధవారం పంజాబ్‌కు వెళ్లిన ప్రధాని మోదీ కాన్వాయ్‌ని కొందరు నిరసనకారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన భద్రతలో పెద్ద లోపాన్ని చూపుతోంది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో నటి కంగనా రనౌత్ కూడా ఈ మొత్తం సంఘటన చాలా సిగ్గుచేటు అని పేర్కొంది.
ప్రధాని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసింది – పంజాబ్‌లో జరిగింది చాలా సిగ్గుచేటు. గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు, ప్రజల ప్రతినిధి, 1.4 బిలియన్ల ప్రజల గొంతుక. ఆయనపై దాడి జరిగితే ప్రతి భారతీయుడిపై జరిగినట్లే, ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి కూడా. ఉగ్రవాద కార్యకలాపాలకు పంజాబ్ కేంద్రంగా మారుతోంది. వాటిని అరికట్టకపోతే దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది అని రాసింది.
బుధవారం ప్రధాని మోడీ బటిండా చేరుకున్నారు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హుస్సేనివాలాలో ఉన్న జాతీయ అమరవీరుల స్మారక స్థూపానికి బయలుదేరారు. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో 20 నిమిషాలు వేచి ఉన్నారు దీంతో రోడ్డు మార్గంలో స్మారకానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్ పోలీసు డిజిపి భద్రతా సౌకర్యాలను ధృవీకరించిన తర్వాత పిఎం మోడీ రోడ్డు మార్గంలో స్మారక చిహ్నం వద్దకు బయలుదేరారు. అయితే స్మారకానికి చేరుకోవడానికి 30 కిమీ ముందు పిఎం మోడీ కాన్వాయ్‌ను ఆందోళనకారులు ఆపారు. 15 నుంచి 20 నిమిషాల పాటు, పిఎం మోడీ ప్లైఓవర్‌పై ఇరుక్కుపోయారు. రహదారి క్లియర్ కాకపోవడంతో అతను తిరిగి అదే మార్గంలో బటిండా విమానాశ్రయానికి వెళ్లారు.