ఆ హీరో అంటే చాలా ఇష్టం.. రెండు సార్లు ఛాన్స్ మిస్ అయ్యా..! ఇంద్రజ క్రేజీ కామెంట్స్
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఆతర్వాత సినిమాలకు దూరమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ పేరుతో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. మరికొందరు పూర్తిగా సినిమాలకు దూరం అవుతున్నారు. అలాంటి వారిలో ఇంద్రజ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.

నటి ఇంద్రజ ఒకప్పుడు వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేసి మెప్పించింది. కానీ ఇప్పుడు సహాయక పాత్రలతో రీ ఎంట్రీ ఇచ్చి మెప్పిస్తున్నారు. అక్క, అమ్మ, అత్త పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇంద్రజ. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిగారితో కలిసి పనిచేయడానికి సంబంధించిన తన అనుభవాలను, ఆకాంక్షలను పంచుకున్నారు. చిరంజీవితో సిస్టర్ పాత్రలను రెండుసార్లు తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. ఆయనతో హీరోయిన్‌గా నటించి ఒక పాటలో డాన్స్ చేయాలనే తన చిరకాల కోరికను వ్యక్తం చేశారు. చిరంజీవిగారితో తనకు రెండుసార్లు అవకాశాలు వచ్చాయని ఇంద్రజ తెలిపారు. మొదటిది ఈవీవీ సత్యనారాయణ గారి అల్లుడామజాకా సినిమా కోసం. అందులో సిస్టర్ క్యారెక్టర్ ఆఫర్ చేయగా, అప్పటికే ఆ పాత్రను ఊహ గారు చేశారని, తనకు కూడా ఆ అవకాశం వచ్చిందని ఇంద్రజ చెప్పారు.
అయితే, చిరంజీవిగారితో డాన్స్ చేయాలనే తన ఆశ కారణంగా, సిస్టర్ పాత్ర చేయలేనని ఆ అవకాశాన్ని వదులుకున్నానని ఆమె వివరించారు. “నేను సార్ తో డాన్స్ చేయాలి మరి సిస్టర్ గా చేస్తే హీరోయిన్ గా చేయలేను కదా” అని తన ఆలోచనను స్పష్టం చేశారు. రెండోసారి, ఎడిటర్ మోహన్ గారి నిర్మించిన హిట్లర్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పక్కన నటించే అవకాశం వచ్చిందని ఇంద్రజ తెలిపారు. కానీ ఆ సమయంలో తాను తమిళంలో రామ్కీ గారితో కలిసి తడయం అనే సినిమాలో నటిస్తున్నానని, అందువల్ల ఆ అవకాశాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ రెండు అవకాశాలు కోల్పోవడం వల్ల చిరంజీవిగారితో కలిసి పనిచేసే అవకాశం దక్కలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. “ఆయనతో సినిమా చేయాలి, ఆయన పెయిర్‌గా చేయాలి అని… సినిమా చేస్తానో లేదో సార్, సార్ తో కలిసి ఒక పాటకి డాన్స్ చేయాలి అంతే,” అని చిరంజీవిగారితో డాన్స్ చేయాలనే తన ఆకాంక్షను ఇంద్రజ బయటపెట్టారు.
చిరంజీవి పేరు డాన్స్ కు పర్యాయపదమని, “డాన్స్ అంటే చిరువు గారు” అని ప్రశంసించారు. వాల్తేర్ వీరయ్యలో ఆయన హుక్ స్టెప్పులు థియేటర్లలో సందడి చేశాయని గుర్తు చేసుకున్నారు. చిరంజీవిగారి నుండి తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఆయన మాట్లాడే విధానం అని ఇంద్రజ తెలిపారు. “ఎంత కోపం ఉన్నా కూడా ఆ మాటల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడా కూడా లూస్ టాక్ అనేది ఒక్కటి కూడా దొరకదు,” అని ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. ఆయన శిష్యురాలినే అని సరదాగా పేర్కొంటూ, ఎవరి దగ్గరైనా మంచి ఉంటే నేర్చుకోవాలని ఆమె సూచించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
