AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికన్ రియాల్టీ సెక్టార్‌కు ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ దెబ్బ

ఒకప్పుడు డాలర్ డ్రీమ్స్ అనగానే.. న్యూయార్క్, కాలిఫోర్నియా గుర్తొచ్చేవి. ఓ దశాబ్ద కాలంగా ఐటీ ఉద్యోగుల పాలిట స్వర్గధామంగా మారింది మాత్రం టెక్సాస్ రాష్ట్రమే. భారతీయులు, ముఖ్యంగా తెలుగోళ్ల కొనుగోళ్లకు అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ కళకళలాడిపోయింది. కానీ.. ఇప్పుడదే టెక్సాస్ రియాల్టీ మార్కెట్ వెలవెల పోతోంది. ఒకప్పుడు ఇళ్ల కొనుగోళ్లకు ఎగబడిన మనవాళ్లు.. ఇప్పుడు రూపాయి పెట్టడానికి కూడా ఎందుకు భయపడుతున్నారు? అటు.. వీసా కష్టాల నుంచి బయటపడేయడానికి కేఏ పాల్ రంగంలోకి దిగారు. ఇంతకీ ఆయన సాధించింది ఏంటి?

అమెరికన్ రియాల్టీ సెక్టార్‌కు ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ దెబ్బ
Housing MarketImage Credit source: PEXELS
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2026 | 8:45 PM

Share

అమెరికాలోని ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఎంత కంగారు పడిపోతున్నారో.. ఎట్ ద సేమ్ టైమ్ ఇండియన్స్ వెళ్లిపోతే ఎలా అని అక్కడి మార్కెట్ కూడా వణికిపోతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మార్కెట్. ఒకప్పుడు డల్లాస్, హ్యూస్టన్ వీధులు భారతీయుల కొనుగోలు శక్తితో కళకళలాడింది. అలాంటి చోట.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలుతోంది. వీసా కష్టాలు, ఉద్యోగాల కోతతో తెలుగువారు ఇన్‌సెక్యూర్ జోన్‌లో పడిపోయారు. టెక్సాస్‌లో ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉండే ఫ్రిస్కో, ప్రాస్పర్, సెలీనా నగరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఘోరంగా పడిపోయింది. గతంలో అక్కడ లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో 60 శాతానికి పైగా భారతీయులదే హవా ఉండేది. కానీ నేడు ఆ వాటా 30 శాతం కంటే దిగువకు పడిపోయింది. ఆస్టిన్ ఏరియాలో ఇళ్ల విలువ గరిష్ట స్థాయి నుంచి దాదాపు 25 శాతం వరకు తగ్గాయి. శాన్ ఆంటోనియో, డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతాల్లో కూడా సగటున 5 శాతం వరకు ధరలు పడిపోయాయి. మార్కెట్లో కొత్త ఇళ్ల లభ్యత విపరీతంగా పెరిగినప్పటికీ, దానికి తగినట్లుగా కొనేందుకు ముందుకు రావడం లేదు. కొవిడ్ మహమ్మారి సమయంలో ఇళ్లను కొనుగోలు చేసిన చాలా మంది యజమానులు.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నార్త్ టెక్సాస్‌లో డిఫాల్ట్‌లు, ఫోర్‌క్లోజర్‌లు ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అటు ఇళ్ల ధరలతో పాటు అద్దెలు కూడా దిగివచ్చాయి. అపార్ట్‌మెంట్లలో అద్దెల రేట్లు సైతం దాదాపు 22 శాతం వరకు పడిపోయాయి.

దీనంతటికీ కారణం.. ట్రంప్. హెచ్-1బీ వీసాలపై కఠినమైన ఆంక్షలు, గ్రీన్ కార్డ్ లభించడంలో దశాబ్దాల ఆలస్యం, ఐటీ రంగంలో లే-ఆఫ్‌ల భయంతో ఇండియన్స్ అక్కడి ఇళ్ల కొనుగోళ్లను దాదాపుగా తగ్గించేశారు. డల్లాస్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల ధరలు దాదాపు 9 శాతం దాకా పడిపోవడంతో బిల్డర్లు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. ఒకప్పటి ‘మార్కెట్ బూమ్’.. ఇప్పుడు ‘మార్కెట్ క్రాష్’గా మారిపోయింది.

టెక్సాస్‌లో ఉన్న లక్షలాది మంది తెలుగు కుటుంబాలకు జాబ్ సెక్యూరిటీ లేకుండా పోయింది. దశాబ్దాలుగా అమెరికాలో ఉంటూ, పిల్లలను చదివిస్తూ, అక్కడే స్థిరపడిన వారికి ఇప్పుడు వీసా పొడిగింపులు ఎప్పుడు రిజెక్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. ఉద్యోగం పోతే కేవలం రెండు నెలల్లో దేశం విడిచి వెళ్లాలనే నిబంధన మానసిక ఒత్తిడిని పెంచుతోంది. దీంతో చాలా మంది ఐటీ నిపుణులు స్వచ్ఛందంగా భారతదేశానికి తిరిగి వచ్చేయాలనుకుంటున్నారు. ఒకవేళ భారతీయుల సంఖ్య తగ్గితే స్థానిక అమెరికన్ మున్సిపాలిటీల పన్నుల ఆదాయం కూడా పడిపోయి, అక్కడి మౌలిక వసతులు దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఇక.. వీసా సంక్షోభంపై వాషింగ్టన్ వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలోని భారతీయులు, ముఖ్యంగా తెలుగువారి పక్షాన నిలిచేందుకు కేఏ పాల్ స్వయంగా రంగంలోకి దిగారు. యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ సమక్షంలో.. కేఏ పాల్ నేతృత్వంలో.. ఒక ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా ప్రజాప్రతినిధులు, సెనేటర్లతో కేఏ పాల్ చర్చించారు. టెక్సాస్, అమెరికా ఆర్థిక వృద్ధిలో ఇండియన్ ఐటీ ఉద్యోగుల పాత్ర ఎంత కీలకమో కేఏ పాల్ వివరించారు. ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పొడిగించాలని, గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌ను వెంటనే క్లియర్ చేయాలని అమెరికన్ స్పీకర్‌ను గట్టిగా డిమాండ్ చేశారు. మరి.. ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి.

Follow Us