AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయులకు బంపర్ ఆఫర్.. సరికొత్త వీసా విధానంతో ఆహ్వానిస్తోన్న ఆ దేశం.. ఇక వారికైతే పండగే..!

Global Talent Visa: భారతీయ పరిశోధకులకు, మేధావులకు గ్లోబల్ వేదికలపై ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు దక్షిణ కొరియా తీసుకొచ్చిన ఈ కొత్త వీసా విధానం వల్ల మన దేశ స్టెమ్ (STEM) నిపుణులకు తూర్పు ఆసియాలో సరికొత్త కెరీర్ ద్వారాలు తెరుచుకున్నట్లయింది. గ్లోబల్ వేదికపై తమ పరిశోధనలను విస్తరించాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారతీయులకు బంపర్ ఆఫర్.. సరికొత్త వీసా విధానంతో ఆహ్వానిస్తోన్న ఆ దేశం.. ఇక వారికైతే పండగే..!
South Korea Global Talent Visa
Venkata Chari
|

Updated on: Jun 07, 2026 | 9:11 AM

Share

South Korea Global Talent Visa: దక్షిణ కొరియాలో స్థిరపడాలనుకునే భారతీయ విద్యావంతులకు ఆ దేశ ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త అందించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (STEM) రంగాల్లోని భారతీయ పరిశోధకులు, ప్రొఫెసర్లను ఆకర్షించేందుకు తన ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ టాలెంట్ వీసా’ పరిధిని భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. మన దేశ ప్రతిభావంతులకు ఇదొక సువర్ణావకాశం.

పరిశోధనలకు పెద్దపీట.. విద్యావేత్తలకు ఆహ్వానం..

ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దక్షిణ కొరియా.. అంతర్జాతీయంగా అత్యున్నత నైపుణ్యాలు కలిగిన నిపుణులను తమ దేశానికి రప్పించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, బయోటెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాలకే పరిమితమైన ఈ టాప్-టైర్ వీసాను.. ఈ ఏడాది జూన్ నుంచి ప్రొఫెసర్లు, పరిశోధకులకు కూడా వర్తింపజేయనున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుకుంటున్న లేదా ఉద్యోగాలు చేస్తున్న భారతీయ విద్యార్థులు, పరిశోధకులు ఈ దీర్ఘకాలిక వీసా ద్వారా దక్షిణ కొరియాలో స్థిరపడేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అసలు అర్హతలు ఏమిటి?

ఈ అంతర్జాతీయ నైపుణ్యాల వీసా సాధించాలంటే దక్షిణ కొరియా ప్రభుత్వం కొన్ని కఠినమైన, పారదర్శకమైన నిబంధనలను విధించింది.

విద్యార్హత: దరఖాస్తుదారులు ప్రపంచంలోని టాప్ 100 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ (PhD) పూర్తి చేసి ఉండాలి.

ఆదాయ పరిమితి: దరఖాస్తుదారుల వార్షిక సంపాదన దక్షిణ కొరియా సగటు వేతనం కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉండాలి.

అనుభవం: ‘ఫార్చ్యూన్ గ్లోబల్ 500’ జాబితాలో ఉన్న అంతర్జాతీయ కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి అదనపు ప్రాధాన్యత లభిస్తుంది.

ఉద్యోగ ఒప్పందం: వీసా దరఖాస్తుకు ముందే కొరియన్ కంపెనీ లేదా అక్కడి ప్రభుత్వ పరిశోధనా సంస్థ నుంచి ఉద్యోగ ఆహ్వాన పత్రం (Job Offer) తప్పనిసరిగా సాధించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఉద్యోగ ఒప్పందం కుదిరిన తర్వాత అభ్యర్థులు దక్షిణ కొరియా అధికారిక వీసా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఆ దేశ సైన్స్ అండ్ ఐసీటీ మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు, న్యాయ మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయి పరిశీలన జరిపి వీసాలను మంజూరు చేస్తుంది. అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనా పత్రాలు ప్రచురించిన వారికి, ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన భారతీయ శాస్త్రవేత్తలకు ఈ ప్రక్రియలో అత్యధిక ప్రాధాన్యత దక్కుతుంది.

2030 నాటికి భారీ లక్ష్యం..

సాంకేతిక రంగంలో గ్లోబల్ లీడర్‌గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని దక్షిణ కొరియా భావిస్తోంది. అందులో భాగంగానే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,000 మంది అత్యున్నత శ్రేణి సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులను తమ దేశానికి రప్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వీసా పొందిన వారికి కేవలం ఉద్యోగ అవకాశాలే కాకుండా, కొరియాలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక, పునరావాస సహాయాన్ని కూడా అందించనుంది.

మరిన్ని కెరీర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us