AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్య చరిత్రలో మరో ముందడుగు.. చిన్నారుల్లో ఆటిజం గుర్తింపుకు యూరిన్ టెస్ట్‌

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) అనేది పిల్లల మెదడు అభివృద్ధి, ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలను ప్రభావితం చేసే ఒక నాడీ సంబంధిత అభివృద్ధి లోపం. సాధారణంగా ఆటిజం లక్షణాలు చిన్న వయసులోనే కనిపించినప్పటికీ, వాటిని సకాలంలో గుర్తించడం చాలాసార్లు సవాలుగా మారుతుంది. అయితే తాజాగా వెలువడిన ఒక పరిశోధన ఆటిజం నిర్ధారణలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. రెండేళ్ల వయస్సున్న చిన్నారుల్లో కూడా సాధారణ మూత్ర పరీక్ష ద్వారా ఆటిజం సంకేతాలను గుర్తించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు..

వైద్య చరిత్రలో మరో ముందడుగు.. చిన్నారుల్లో ఆటిజం గుర్తింపుకు యూరిన్ టెస్ట్‌
Urine Test For Autism Diagnosis
Srilakshmi C
|

Updated on: Jun 07, 2026 | 9:38 PM

Share

ప్రఖ్యాత ‘మాలిక్యులర్ సైకియాట్రీ’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం వైద్యరంగంలో విశేష చర్చకు దారితీసింది. ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా పిల్లలకు అవసరమైన థెరపీ, ప్రత్యేక శిక్షణ, వైద్య సహాయం మరియు నిపుణుల మార్గదర్శకత్వం త్వరగా అందించే అవకాశం ఉంటుంది. దీంతో వారి అభివృద్ధిలో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆటిజం నిర్ధారణ కోసం పిల్లల ప్రవర్తన, మాట్లాడే తీరు, సామాజిక ప్రతిస్పందనలు, రోజువారీ కార్యకలాపాలను పరిశీలించడం వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో కూడిన సులభమైన మూత్ర పరీక్ష అందుబాటులోకి వస్తే, ప్రారంభ దశలోనే ఆటిజం సంకేతాలను గుర్తించడం మరింత సులభమవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

ఈ అధ్యయనంలో ఆటిజం ఉన్న పిల్లలు మరియు ఆటిజం లేని పిల్లల మూత్ర నమూనాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. పరీక్షల సందర్భంగా రెండు వర్గాల పిల్లల మూత్రంలో కొన్ని జీవసంబంధ గుర్తులు (బయోమార్కర్లు) వేర్వేరు స్థాయిల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ తేడాల ఆధారంగా ఆటిజంకు సంబంధించిన సంకేతాలను గుర్తించే ప్రయత్నం చేశారు. అధ్యయనం ఫలితాల ప్రకారం, ఆటిజం ఉన్న పిల్లలను గుర్తించడంలో ఈ పరీక్ష ఆశాజనకమైన ఖచ్చితత్వాన్ని ప్రదర్శించింది. ఈ పరీక్షలో మూత్రంలోని కొన్ని ప్రత్యేక రసాయనాలు, జీవసంబంధ సంకేతాలను పరిశీలిస్తారు. ఇవి శరీరంలో మరియు ఇతర సూక్ష్మజీవుల కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మూత్ర నమూనాను ప్రయోగశాలలో పరీక్షించి, అందులోని రసాయన నమూనాలను విశ్లేషించడం ద్వారా ఆటిజంతో సంబంధం ఉన్న సంకేతాలను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. ఈ విధానంలో ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఇది చాలా సులభమైనది మరియు కేవలం ఒక మూత్ర నమూనా మాత్రమే అవసరం కావడం.

ఇవి కూడా చదవండి

అయితే ప్రస్తుతం ఈ పరీక్ష ఇంకా పరిశోధన దశలోనే ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీనిని సాధారణ వైద్య పరీక్షగా అమలు చేయడానికి ముందు మరిన్ని పెద్ద స్థాయి అధ్యయనాలు, ధృవీకరణలు అవసరమని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆటిజం నిర్ధారణకు ప్రధానంగా పిల్లల ప్రవర్తన, అభివృద్ధి లక్షణాలు, వైద్య నిపుణుల పరిశీలనలే ఆధారంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, తల్లిదండ్రులు పిల్లల్లో కనిపించే కొన్ని ప్రారంభ లక్షణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు కళ్లలోకి చూస్తూ మాట్లాడకపోవడం, పేరు పిలిచినా స్పందించకపోవడం, మాట్లాడటంలో ఆలస్యం, ఇతర పిల్లలతో కలవడానికి ఆసక్తి చూపకపోవడం, ఒకే పనిని పదేపదే చేయడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు. ఈ కొత్త పరిశోధన భవిష్యత్తులో ఆటిజం నిర్ధారణను మరింత వేగవంతం చేసి, లక్షలాది కుటుంబాలకు ఉపయోగపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us