రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా?.. ఈ అలవాట్లే కారణం.. వెంటనే మానేయండి
ఆహారం, నీరు మన శరీరానికి ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే ముఖ్యమైనది. ప్రతిరోజూ 8 నుంచి 9 గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోవడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, మధ్యలో మేల్కొనడం, ఉదయం అలసటగా అనిపించడం వంటి సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి..

మన రోజువారీ అలవాట్లే నిద్ర నాణ్యతను ప్రభావితం చేసే ప్రధాన కారణాల్లో ఒకటి. ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువసేపు మొబైల్ ఫోన్ ఉపయోగించడం నిద్రకు పెద్ద శత్రువుగా మారింది. ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి (బ్లూ లైట్) శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ నిద్ర-మేల్కొలుపు చక్రాన్ని నియంత్రిస్తుంది. ఫలితంగా నిద్ర పట్టడం ఆలస్యం కావడం, నిద్ర నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే రాత్రి వేళల్లో కాఫీ, టీ లేదా మద్యం సేవించడం కూడా నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కెఫీన్ శరీరాన్ని ఉత్తేజపరిచే గుణం కలిగి ఉండటంతో నిద్ర రావడాన్ని ఆలస్యం చేస్తుంది. అందువల్ల నిద్రకు కనీసం నాలుగు గంటల ముందు నుంచి కాఫీ, టీ వంటి పానీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
నిద్రకు ముందు భారీగా భోజనం చేయడం కూడా మరో సమస్య. ఎక్కువగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో పడుకున్న తర్వాత కూడా జీర్ణక్రియ కొనసాగి నిద్రకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి రాత్రి భోజనం తేలికగా, నిద్రకు రెండు నుంచి మూడు గంటల ముందే ముగించడం మంచిది. పగటిపూట ఎక్కువసేపు నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో కూడా రాత్రి నిద్ర సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ధూమపానం చేసే వారిలో నికోటిన్ ప్రభావం వల్ల మెదడు ఉత్తేజితమై నిద్ర పట్టడం కష్టమవుతుంది. నిద్రకు ముందు సిగరెట్లు తాగడం నిద్ర నాణ్యతను మరింత దెబ్బతీస్తుంది.
అతిగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం, వ్యక్తిగత లేదా ఉద్యోగ సంబంధిత ఒత్తిడిని ఎక్కువగా మోసుకెళ్లడం కూడా నిద్రలేమికి ప్రధాన కారణాలు. ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మెదడును అప్రమత్త స్థితిలో ఉంచి నిద్రను దూరం చేస్తుంది. అంతేకాకుండా, నిశ్చల జీవనశైలి కూడా నిద్రలేమికి దారితీస్తుంది. రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం, ఒత్తిడిని నియంత్రించడం వంటి అలవాట్లు మంచి నిద్రకు దోహదపడతాయి. నిద్రలేమి సమస్య ఎక్కువకాలం కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.




