EC Bans DMK A Raja : మాజీ కేంద్రమంత్రి, డీఎంకే నేత ఎ రాజాపై ఎన్నికల కమిషన్ సీరియస్, 48గంటల పాటు నిషేధం
EC action against DMK Leader A RAJA : తమళినాడులో డీఎంకే మాజీ ఎంపీ రాజాపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. సీఎం పళనిస్వామి..
EC action against DMK Leader A RAJA : తమిళనాడు డీఎంకే పార్టీ మాజీ ఎంపీ రాజాపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. సీఎం పళనిస్వామిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఈసీ ఖండించింది. 48 గంటలపాటు డీఎంకే రాజా ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. అంతేకాదు డీఎంకే స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి ఎన్నికల కమిషన్ ఎ.రాజాను తొలగించింది. అంతకుముందు రాజా ఇచ్చిన వివరణ అసందర్భంగా ఉండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
అసలు రాజా పై ఈసీ చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయానికొస్తే, చెన్నై పరిధిలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి డాక్టర్ ఎన్.ఎళిలన్ తరఫున రాజా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీఎం పళనిస్వామిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తమళనాడు సీఎం పళనిస్వామిని డీఎంకే అధినేత స్టాలిన్ కాలి చెప్పుతో పోల్చారు. అంతేనా.. ‘అక్రమ సంబంధం కారణంగా పుట్టిన అపరిపక్వ రాజకీయ శిశువు’ అని ముఖ్యమంత్రి పళనిస్వామిని విమర్శించారు. అదే సమయంలో స్టాలిన్ ను మాత్రం ‘నికరంగా పుట్టిన పరిణతి చెందిన బాలుడు’ అని కామెంట్ చేశారు రాజా.
అంతేకాదు, ఏరోజుకారోజే బెల్లం మార్కెట్టులో పనిచేసుకుంటూ పదవిలోకి వచ్చిన పళనిస్వామిని స్టాలిన్ తో ఎలా పోల్చగలం? అని రాజా అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు ‘స్టాలిన్ కాలిచెప్పు నీకంటే ఓ రూపాయి ఎక్కువ ధరే పలుకుతుంది… నువ్వా స్టాలిన్ కు సవాల్ విసిరేది?’ అని రాజా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇదే ఇప్పుడు తమిళనాట ఉద్రిక్తతలకు కారణమవడంతోపాటు, ఎ రాజాపై ఈసీ చర్యలకు కారణమైంది. కాగా, మరోవైపు తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధానపార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే, ఏడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసకెళ్తున్నాయి. పరస్పర ఆరోపణలతో తమిళనాట పొలిటికల్ హీట్ పెరిగింది.