TN Election 2021: డీఎంకే మహిళా వ్యతిరేక పార్టీ…ఓటింగ్ నాడు బుద్ధిచెప్పాలన్న అమిత్ షా
Tamil Nadu Assembly Election 2021: తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామిపై డీఎంకే సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇప్పటికే తన వ్యాఖ్యల పట్ల ఏ.రాజా క్షమాపణ కోరారు.
తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామిపై డీఎంకే సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇప్పటికే తన వ్యాఖ్యల పట్ల ఏ.రాజా క్షమాపణ కోరారు. అయినా శాంతించని అన్నాడీఎంకే, బీజేపీ నేతలు…డీఎంకే నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఏ.రాజా 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరుక్కోయిలూర్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా…ఏ.రాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
సీఎం ఈపీఎస్ తల్లిపై ఏ.రాజా అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని అమిత్ షా మండిపడ్డారు. మరణించిన మహిళనుద్దేశించి ఇలా మాట్లాడటం దారుణమన్నారు. గతంలో ధివంగత మాజీ సీఎం జయలలితపై కూడా డీఎంకే నేతలు ఇదేరకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. మహిళల పట్ల డీఎంకేకి ఏ మాత్రం గౌరవం లేదని తేలిపోయిందని ధ్వజమెత్తారు. డీఎంకే మహిళా వ్యతిరేక పార్టీగా ఆరోపించారు. ఏప్రిల్ 6న ఓటింగ్ రోజున తమిళ తల్లులు, సోదరీమణులు డీఎంకేకి గట్టి గుణపాఠం చెప్పాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
డీఎంకే, కాంగ్రెస్ దొందూ దొందే… అధికార దాహంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలుపొందాలని డీఎంకే ఇష్టారీతిగా వ్యవహరిస్తోందని అమిత్ షా మండిపడ్డారు. డీఎంకే, కాంగ్రెస్‌లు దొందూదొందేనంటూ విరుచుకుపడ్డ హోం మంత్రి…ఆ రెండు పార్టీలూ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయాయని…వారసత్వ రాజకీయాలు నడుపుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి బాటలో నడుస్తున్న ఎన్డీయేకి, అవినీతి, వారసత్వ రాజకీయాలు నడుపుతున్న డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు మధ్య పోటీ నెలకొంటోందన్నారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సును పట్టించుకునే స్థితిలో ఆ రెండు పార్టీలూ లేవన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ..ఆమె తనయుడు రాహుల్ గాంధీ భవిష్యత్తు గురించి బెంగపెట్టుకోగా…డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆయన తనయుడు ఉదయనిధి భవిష్యత్తుపై బెంగపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకే కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు.
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఈ నెల 6న పోలింగ్ జరగనుంది.