UP Elections 2022: ఆరో దశ ఎన్నికల్లో నేర చరిత్ర నాయకులు అధికమే.. కోటీశ్వరులు ఎక్కువే.. వివరాలివే
క్రైమ్ పాలిటిక్స్.. దీనిని మన దేశంలో తప్ప మరెక్కడా చూడం. ఎక్కువ డబ్బు, నేరాలు చేస్తే చాలు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి...
క్రైమ్ పాలిటిక్స్.. దీనిని మన దేశంలో తప్ప మరెక్కడా చూడం. ఎక్కువ డబ్బు, నేరాలు చేస్తే చాలు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉన్నట్లే.. ఈ విషయాలన్నీ కూడా ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ఆరో విడత ఎన్నికల ముందు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ చేసిన సర్వేలో తేటతెల్లమైంది. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కోట్ల ఆస్తి, నేర చరిత్ర ఉన్న వ్యక్తులను అభ్యర్ధులుగా ఎంచుకున్నట్లు ఈ సర్వేలో తేలింది. మొదటి దశ ఎన్నికల నుంచి ఈ పంధా కొనసాగుతుండగా.. ఏ పార్టీ కూడా మహిళా అభ్యర్ధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టమైంది.
ప్రతి నలుగురిలో ఒకరికి నేరచరిత్ర..
అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ADR) నివేదిక ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 182 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా.. వీరిలో 27 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఆయా అభ్యర్ధులు తమ అఫిడివేట్‌లలో కూడా పొందుపరిచారు.
182 మంది అభ్యర్థుల్లో 123 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. ఈ క్రిమినల్ కేసుల్లో గరిష్టంగా 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే నేరాలు, నాన్ బెయిలబుల్ నేరాలు ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అత్యధికంగా క్రిమినల్ కేసులున్న 40 మంది అభ్యర్థులను బరిలోకి దింపిందని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత 23 మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉండగా.. కాంగ్రెస్‌లో 22 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నట్లు తేలింది. బీఎస్పీలో కూడా 22 మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే మొత్తం 8 మంది అభ్యర్థులపై మహిళలపై నేరాలు చేసినట్లుగా కేసులు నమోదు కాగా, వారిలో ఇద్దరిపై అత్యాచారం కేసులు, మరో ఇద్దరిపై హత్య కేసులు ఉన్నాయి.
పార్టీల్లో కోటీశ్వరులు ఎంతమంది..
ఏడీఆర్ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్ ఆరో దశ అసెంబ్లీ ఎన్నికలలో 38 శాతం (670 మందిలో 253 మంది) మంది కోటీశ్వరులు ఉన్నారు. గత మూడు దశల ఎన్నికల్లో కోటీశ్వరుల సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నట్లు నివేదికలో తేలింది. నాలుగు, ఐదో దశలో 37 శాతం, 36 శాతం మంది అభ్యర్ధులు కోటీశ్వరులుగా ఉన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ (SP), భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులలో 80 శాతం మందికి రూ.1 కోటి అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే 60 మంది అభ్యర్థులకు రూ.5 కోట్లకు పైగా ఆస్తులు ఉండగా.. 100 మంది అభ్యర్థులు తమకు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే దాదాపు సగం మంది అభ్యర్థులు (670 మందిలో 333 మంది) రూ.50 లక్షల కంటే తక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. బీఎస్పీకి చెందిన నలుగురిలో దాదాపు ముగ్గురు కోటీశ్వరులు కాగా, ఎన్నికల బరిలో నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థులలో సగం మంది కూడా కోటీశ్వరులేనని డేటా చెబుతోంది. ఇక మహిళా అభ్యర్ధుల్లో కూడా సగం మంది కోటీశ్వరులని నివేదిక పేర్కొంది.
మరోవైపు ఆరో దశ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్లో దాదాపు 10 శాతం(605 మందిలో 65 మంది) మహిళలు ఉన్నారని ఏడీఆర్ సర్వే స్పష్టం చేస్తోంది. ఈ దశ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ దాదాపు 39 శాతం మంది మహిళా అభ్యర్థులను బరిలో నిలబెట్టింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు మూడింట ఒకవంతు మహిళలకే టిక్కెట్లు ఇస్తామని పార్టీలు ప్రకటించాయి. ఇక మిగిలిన ప్రధాన పార్టీలలో 10 శాతం కంటే తక్కువ మంది మహిళా అభ్యర్ధులు ఉన్నారు.
ఎస్పీ 10 శాతం మహిళా అభ్యర్థులను బరిలోకి దింపగా.. బీఎస్పీ, బీజేపీలు ఈ దశ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 9, 6 శాతం టిక్కెట్లు కేటాయించాయి. కాగా, ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ, ఆప్ పార్టీల నుంచి బరిలో ఉన్న మహిళా అభ్యర్ధుల సంఖ్య ఈ దశ ఎన్నికలలో కాంగ్రెస్ కంటే తక్కువగా ఉండటం గమనార్హం.