Karnataka Election Results: కర్ణాటకలో కౌంటింగ్‌.. తెలంగాణలో లబ్‌డబ్‌.. ఫలితాలపై పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితే ఆ ప్రభావం తెలంగాణపై కచ్చితంగా ఉంటుందని.. తద్వారా పార్టీలో మరింత జోష్‌ పెరుగుతుందని కమలనాథులు నమ్ముతున్నారు. నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణనే కాబట్టి.. కర్నాటక ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది కాషాయ దళం.

Karnataka Election Results: కర్ణాటకలో కౌంటింగ్‌.. తెలంగాణలో లబ్‌డబ్‌.. ఫలితాలపై పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ
Telangana Leaders
Follow us

|

Updated on: May 13, 2023 | 6:29 AM

కర్ణాటకపై కాంగ్రెస్‌, బీజేపీ భారీ ఆశలే పెట్టుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పాగావేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి కర్ణాటకలో విజయం చాలా కీలకం. దక్షిణాదిన కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. భవిష్యత్తులో మిగతా దక్షిణాది రాష్ట్రాలకూ విస్తరించాలనుకుంటున్న బీజేపీ.. మరోసారి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పా టు చేస్తేనే అందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితే ఆ ప్రభావం తెలంగాణపై కచ్చితంగా ఉంటుందని.. తద్వారా పార్టీలో మరింత జోష్‌ పెరుగుతుందని కమలనాథులు నమ్ముతున్నారు. నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణనే కాబట్టి.. కర్నాటక ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది కాషాయ దళం. కర్నాటక అయిపోగానే.. తెలంగాణపైనే దృష్టి పెడతామంటూ ఇటీవల అమిత్‌ షా ప్రకటించడంతో ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఇప్పటికే సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో విజయం కీలకం కానుంది. ఎన్నిక ఏదయినా వరుస ఓటములతో కుంగిపోతున్న ఆ పార్టీ.. కర్నాటకలో గెలిచి.. తెలంగాణలో విజయానికి బాటలు వేసుకోవాలనుకుంటోంది. తెలంగాణలో బలమైన క్యాడర్‌ ఉన్న హస్తం పార్టీ… కొన్నేళ్లుగా బీఆర్‌ఎస్‌, బీజేపీల దాటికి వెనుకబడిపోయింది. కాబట్టి కర్నాటకలో విజయం సాధించి.. ఆ జోష్‌ తెలంగాణలో కంటిన్యూ చేయాలని భావిస్తోంది.

కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ..

ఇప్పటికే మెజార్టీ సర్వేలు కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉండటంతో.. ఫలితాలు అదేవిధంగా వస్తే, ఆ ట్రెండ్స్‌ తెలంగాణలోనూ రిపీట్‌ కావొచ్చన్న ధీమాతో ఉన్నారు టీ కాంగ్రెస్‌ నేతలు. ఎవరిదోవ వారిదే అన్నట్టుండే నేతల్లోనూ.. ఐక్యత వచ్చే అవకాశం ఉంది. కర్నాటకలో విజయం.. తెలంగాణలో పార్టీకి ఉత్తేజాన్నిస్తుందన్నది హస్తంనేతల ఆశ. మరి అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. అయితే, కర్నాటక ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపవని బీఆర్‌ఎస్‌ చెబుతోంది. అక్కడ ఏ పార్టీ గెలిచినా, ఇక్కడ ప్రజలు మాత్రం కేసీఆర్‌కే పట్టం కడుతారని గులాబీదళం నమ్ముతోంది. తెలంగాణ బ్రాండ్‌ అంటే బీఆర్‌ఎస్‌ మాత్రమే అని, గ్రామీణ స్థాయిలో బీఆర్‌ఎస్‌ ఓట్‌బ్యాంక్‌ చెక్కు చెదరలేదని ధీమా వ్యక్తం చేస్తోంది. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ముందు విపక్షాలు నిలవలేవంటున్నారు కారు పార్టీ నేతలు.

జంపింగ్‌ జపాంగ్‌లపై క్లారిటీ..

ఏ పార్టీ వర్షన్‌ ఎలా ఉన్నా… దక్షిణాదిన కీలకంగా భావించే కర్నాటక ఎన్నికల ఫలితాలు.. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు కారణమవుతాయన్నది విశ్లేషకుల మాట. ఇప్పటికే, వివిధ పార్టీలలో అసమ్మతి నేతలు, పలు కారణాలతో సైలెంట్‌గా ఉంటున్న నేతలు.. రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. జంపింగ్‌ జపాంగ్‌లు ఎవరనేది కూడా తేలిపోనుంది. వచ్చే ఎన్నికల సమరం.. బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీనా, లేక బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ గా ఉండబోతోందా? అనేది తేలిపోనుంది. మరి, కర్నాటకలో ఎలాంటి ఫలితం వెలువడుతుందో.. అది తెలంగాణలో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో.. వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..