Karnataka Polls: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. ఆ సీట్ల విషయంలో కొలిక్కిరాని ప్రతిష్టంభన!
Karnataka Congress: కొన్ని నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ వారికే టిక్కెట్లు ఇవ్వాలని అటు మాజీ సీఎం సిద్ధరామయ్య.. ఇటు పీసీసీ చీఫ్ డికే శివకుమార్ పట్టుబట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

Karnataka Elections 2023: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ గురువారంనాడు విడుదల చేసింది. రెండో జాబితాలో 41 మంది అభ్యర్థులకు చోటు కల్పించింది. మరో సీటును సర్వోధయ కర్నాటక పార్టీకి కేటాయించింది. దీంతో ఇప్పటి వరకు ఆ పార్టీ 142 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయ్యింది. మార్చి నెలలో 100 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం రిలీజ్ చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో మిగిలిన 82 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ(CEC) సమావేశంలో రెండో అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు కర్నాటక కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కర్నాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి రణ్‌దీప్ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.




కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా..
ಕರ್ನಾಟಕ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಯ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ 42 ಕ್ಷೇತ್ರದ ಅಭ್ಯರ್ಥಿಗಳ 2ನೇ ಪಟ್ಟಿಯನ್ನು ಅಧಿಕೃತವಾಗಿ ಬಿಡುಗಡೆಗೊಳಿಸಲಾಗಿದೆ.
ರಾಜ್ಯದ ಭವ್ಯ ಭವಿಷ್ಯಕ್ಕಾಗಿ, ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ, ಭ್ರಷ್ಟಾಚಾರ ಮುಕ್ತ ಆಡಳಿತಕ್ಕಾಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿಗಳನ್ನು ಬೆಂಬಲಿಸಿ, ಆಯ್ಕೆ ಮಾಡಬೇಕೆಂದು ವಿನಂತಿಸುತ್ತೇವೆ. pic.twitter.com/FrV8v9wXkg
— Karnataka Congress (@INCKarnataka) April 6, 2023
కొన్ని నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ వారికే టిక్కెట్లు ఇవ్వాలని అటు మాజీ సీఎం సిద్ధరామయ్య.. ఇటు పీసీసీ చీఫ్ డికే శివకుమార్ పట్టుబట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది. టిక్కెట్ల కేటాయింపు విషయంలో పార్టీ సీనియర్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటి విషయంలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది. 175 స్థానాలకు అభ్యర్థుల విషయంలో పార్టీలో ఇప్పటికే ఏకాభిప్రాయం ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల విషయంలోనూ చర్చించి త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పారు.
కర్నాటక అసెంబ్లీకి మే 10న పోలింగ్ నిర్వహించి.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది ఈసీ. బీజేపీని ఓడించి అధికార పగ్గాలు హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఆ పార్టీ నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. తమకే సీటు ఇవ్వాలంటూ బెంగుళూరులోని పీసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆశావహులు తమ మద్ధతుదారులతో కలిసి రెండ్రోజుల క్రితం ఆందోళన చేపట్టారు. తమను కాదని ఇటీవల బీజేపీ, జేడీఎస్‌ల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ విజయం తథ్యమన్న నమ్మకం కారణంగానే టిక్కెట్ కోసం పార్టీ నేతల మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి




