‘ఫిల్మ్ స్టార్స్ వస్తారు.. పోతారు..’ BJPకి కిచ్చా సుదీప్ మద్ధతుపై డీకే శివకుమార్ రియాక్షన్..
Karnataka Elections 2023: త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సినీ నటుడు కిచ్చా సుదీప్ మద్ధతు ప్రకటించడం తెలిసిందే. తాను బీజేపీలో చేరడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బుధవారం స్పష్టంచేసిన సుదీప్..

Karnataka Elections 2023: త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సినీ నటుడు కిచ్చా సుదీప్ మద్ధతు ప్రకటించడం తెలిసిందే. తాను బీజేపీలో చేరడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బుధవారం స్పష్టంచేసిన సుదీప్.. అయితే త్వరలో జరిగే ఎన్నికల్లో సీఎం బసవరాజ్ బొమ్మైకి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. బసవరాజ్ బొమ్మైతో వ్యక్తిగతంగా తనకు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
బుధవారం మీడియాను కలిసిన కిచ్చా సుదీప్.. ‘నేను ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు. నేను ఏ పార్టీ కోసమో.. డబ్బు కోసమో ఇక్కడికి రాలేదు. ఒక వ్యక్తి కోసమే నేను ఇక్కడకు వచ్చాను. నాకు సీఎం (బొమ్మై)పై చాలా గౌరవం ఉంది.అందుకే ఆయనకు నా పూర్తి మద్ధతు ప్రకటిస్తున్నాను. అయితే నేను రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నేను ఇంకా చాలా సినిమాలు చేయాల్సి ఉంది. అప్పుడే నా ఫ్యాన్స్ కూడా సంతోషిస్తారు’ అని పేర్కొన్నారు. సుదీప్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్ధతుగా సుదీప్ ప్రచారం చేస్తారని వెల్లడించారు. దీని కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సుదీప్ మద్ధతు పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతోందని వ్యాఖ్యానించారు.
కిచ్చా సుదీప్ బీజేపీకి మద్ధతు ప్రకటించడంపై కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. సినిమాలు, రాజకీయాలు రెండూ వేర్వేరుగా పేర్కొన్నారు. కిచ్చా సుదీప్ బీజేపీకి మద్ధతు ప్రకటించడం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. చాలా మంది సినీ తారలు వస్తుంటారు.. పోతుంటారని వ్యాఖ్యానించారు. సినిమాలకు, రాజకీయాలకు చాలా తేడా ఉందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
కర్నాటక అసెంబ్లీలోని మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ ప్రకటించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించగా.. కాంగ్రెస్ 78 స్థానాలు, కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ 37 స్థానాల్లో విజయం సాధించింది.
గత నాలుగు దశాబ్ధాల కర్నాటక చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీ.. తదుపరి ఎన్నికల్లో విజయం సాధించలేదు. అయితే ఈసారి ఆ ఆనవాయికి చెక్ చెప్పి మళ్లీ అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అయితే కర్నాటక ప్రజలు ఈ సారి తమ పార్టీకే పట్టంకడుతారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి




