వివాహవేడుకలో విషాదం…పెళ్లి ఊరేగింపులో వివాదం..యువకుడి హత్య..
జగిత్యాల జిల్లాలో పెండ్లి ఊరేగింపులో తలెత్తిన చిన్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. చివరకు ఓ యువకుడి హత్యకు దారితీసింది.

జగిత్యాల జిల్లాలో పెళ్లి ఊరేగింపులో తలెత్తిన చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. చివరకు ఓ యువకుడి హత్యకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతమంతా భయనకంగా మారిపోయింది.
జిల్లాలోని మేడిపల్లి మండలం భీమరం గ్రామంలో గురువారం రాత్రి ఓ వర్గానికి చెందిన యువకుడి వివాహ ఊరేగింపు జోరుగా సాగింది. డి.జె సౌండ్ తో పాటలకు స్టెప్పులు వేస్తూ అంతా ఎంజాయ్ చేస్తున్నారు పెళ్లి కొడుకు స్నేహితులు. అంతలో మరో వర్గానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు అక్కడికి చేరుకుని వారితో కలిసి స్టెప్పులేస్తుండగా, కొందరు యువకులు డి.జె ఆపేసి లక్ష్మణ్‌తో గొడవకు దిగారు. దీంతో అక్కడున్న వారంతా ఇరువురికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
పెళ్లి ఊరేగింపు ఇంటికి చేరుకుంది. అంతలో ఓ యువకుడు మద్యం తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లాడు..తిరిగి రాకపోవడంతో రాజు అనే మరో యువకుడు…అతడి కోసం వెళ్లాడు. అక్కడ లక్ష్మణ్‌తో గొడవ జరుగుతుండటం గమనించాడు. కోపంతో ఊగిపోయిన రాజు…లక్ష్మణ్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందినట్లుగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు రాజు అక్కడ్నుంచి పరారైనట్లుగా చెప్పారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
