Crime News: దశదిన కర్మకు వెళ్లి ముగ్గురు మృతి.. మద్యం తాగి కుప్పకూలిన బాధితులు.. అసలేమైందంటే..?
Khammam Crime News: తెలంగాణలోని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చంద్రుతండా గ్రామంలో బంధువుల కర్మకాండల కార్యక్రమానికి హాజరైన ముగ్గురు
Khammam Crime News: తెలంగాణలోని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చంద్రుతండా గ్రామంలో బంధువుల కర్మకాండల కార్యక్రమానికి హాజరైన ముగ్గురు వ్యక్తులు మరణించారు. కల్తీ మద్యం సేవించడంతోనే మరణించినట్లు పేర్కొంటున్నారు. భోజనాలకు వెళ్లివచ్చిన అనంతరం ముగ్గురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే వారిని హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు బంధువులు పేర్కొన్నారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుతండాకు చెందిన బోడ భిక్షం కుమారుడు అర్జున్ పది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు శనివారం ఆయన దశదినకర్మ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సమీప బంధువులైన బోడ హరిదాసు (60), మల్సూరు (57), భద్రు (30) వెళ్లారు. వీరికి భోజనంతోపాటు రెండు సీసాల్లో మద్యాన్ని బంధువులు ఇచ్చారు. ఒక సీసాలోని మద్యం తాగిన ముగ్గురు కళ్లు తిరుగుతున్నాయని చెప్పి పడిపోయారు. వారిని ఖమ్మానికి తీసుకెళ్తుండగా బోడ హరిదాసు, భద్రు మార్గ మధ్యంలో మరణించారు. మల్సూరు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. భోజనం కోసం వెళ్లిన ఆరుగురిలో.. ముగ్గురు ఒక సీసాలోని మందు తాగి చనిపోయినట్లు బంధువులు తెలిపారు. రెండో సీసాలోని మద్యం తాగిన వారి పరిస్థితి సాధారణంగా ఉందని పేర్కొన్నారు.
అయితే.. దశదినకర్మ నిర్వాహకులకు, చనిపోయినవారి కుటుంబాల మధ్య గతంలో భూ వివాదం ఉన్నట్లు బాధితుల బంధువులు పేర్కొంన్నారు. విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురి మృతికి విషప్రయోగమా.. లేక.. కల్తీ మద్యమా అనేది ఇంకా తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా దశదినకర్మ కార్యక్రమం నిర్వహించిన బోడ భిక్షం కుటుంబీకులు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కాగా.. ఈ ఘటనతో చంద్రుతండాలో విషాదం నెలకొంది.
Also Read: