Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల గల్లంతు విధంబెట్టిదనిన.. కేటుగాళ్ల జాబితా చాంతాడంత.!

తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారికి సహకరించిన ఆరోపణలపై యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌ వలీ

Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల గల్లంతు విధంబెట్టిదనిన.. కేటుగాళ్ల జాబితా చాంతాడంత.!
Telugu Academy Scam
Follow us

|

Updated on: Oct 02, 2021 | 9:00 AM

Telugu Academy funds scam: తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారికి సహకరించిన ఆరోపణలపై యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌ వలీ, ఏపీ మర్కంటైల్‌ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన ఆపరేషన్స్‌ మేనేజర్‌ పద్మావతి, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ సయ్యద్‌ మొయినుద్దీన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. సొసైటీ చైర్మన్‌ సత్యనారాయణరావును విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.

ఈ స్కామ్‌లో మొత్తం 77 కోట్లు గోల్ మాల్ జరిగినట్టు తెలుస్తోంది. రెండు కో ఆపరేటివ్ బ్యాంకుల నుంచి.. మరో 17కోట్లు గల్లంతైన విషయం బయటికి వచ్చింది. యూనియన్ బ్యాంక్‌ కార్వాన్‌ బ్రాంచ్‌ నుంచి 43కోట్లు… సంతోష్‌నగర్ శాఖ నుంచి 8కోట్లు గల్లంతు కాగా, కెనరా బ్యాంక్ నుంచి మరో 9కోట్లు దారి మళ్లించారు. తాజాగా బయటపడిన 17కోట్లతో కలిపి మొత్తం కుంభకోణం విలువ 77కోట్లకు చేరింది.

తెలుగు అకాడమీ నిధుల గోల్‌ మాల్‌ నేపథ్యంలో అకాడమీ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో ఉన్న సోమిరెడ్డిని ప్రభుత్వం తప్పించింది. ఆయన స్థానంలో పాఠశాల విద్యా కమిషనర్‌ దేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు నిధుల గోల్‌మాల్‌పై ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంది. రెండు రోజులుగా వారు అకాడమీ పత్రాలు, లావాదేవీలు, రికార్డులు పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని గుర్తించడంతో పాటు డైరెక్టర్‌పై వేటుకు సిఫారసు చేసినట్టు సమాచారం.

మూడు నెలల క్రితం ఎఫ్‌డీలను కాజేయడానికి పథకం రచించారు. ఎఫ్‌డీ చేసిన సమయంలోనే ఆ పత్రాలను కలర్‌ జిరాక్సు తీసుకున్నారు. సంతోష్‌నగర్, కార్వాన్‌ల్లోని యూబీఐ, చందానగర్‌ కెనరా బ్యాంక్‌ శాఖల్లోని 12 ఎఫ్‌డీలుగా ఉన్న నిధులు కాజేయడానికి కుట్ర పన్నారు. అంత మొత్తాన్ని ఖాతాల్లోకి తెచ్చినా నేరుగా డ్రా చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి.. సిద్ధి అంబర్‌బజార్‌లోని ఏపీ మర్కంటైల్‌ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌లో తెలుగు అకాడమీ పేరుతో ఖాతా తెరిచారు.

అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురు దుండగులు.. ఖాతాలను లిక్విడేట్‌ చేశారు. ఆ నిధులను సిద్ధి అంబర్‌బజార్‌లోని అగ్రసేన్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో ఉన్న సొసైటీ ఖాతాలోకి బదిలీ అయ్యేలా చేశారు. ఆ తర్వాత డ్రా చేసేశారు. దీని కోసం సొసైటీకి 10 శాతం వరకు కమీషన్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం రెండు నెలల వ్యవధిలో ఈ తతంగాన్ని పూర్తి చేసినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది.

తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వెనుక యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌ మేనేజర్ మస్తాన్ వలీనే సూత్రధారిగా తేలింది. కార్వాన్ అండ్ సంతోష్‌నగర్ బ్రాంచ్‌ల నుంచి నిధుల గల్లంతైన సమయంలో మస్తాన్ వలీనే మేనేజర్‌గా ఉన్నాడు. కార్వాన్‌ బ్రాంచ్‌లో 43కోట్లను దారి మళ్లించిన మేనేజర్ మస్తాన్‌ వలీ.. రెండు నెలల క్రితమే సంతోష్‌నగర్ బ్రాంచ్‌కు బదిలీపై వెళ్లాడు. అక్కడ కూడా 8కోట్లను కాజేశాడు. ఇదే తరహాలో మరో మూడు బ్యాంకుల నుంచి 26కోట్లు కొట్టేశాడు. చందానగర్ కెనరా బ్యాంక్ నుంచి 9కోట్లు.. రెండు కోఆపరేటివ్‌ బ్యాంకుల నుంచి 17కోట్లు మాయం చేశారు.

నిబంధనల ప్రకారం ఏదైనా ఎఫ్‌డీ రద్దు చేసుకుంటే.. ఆ మొత్తాన్ని ఎవరి పేరుతో ఖాతా ఉంటే ఆ ఖాతాలోనే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా యూబీఐ, కెనరా బ్యాంకు అధికారులు తెలుగు అకాడమీ ఎఫ్‌డీల డబ్బును.. అగ్రసేన్‌ బ్యాంక్‌లో ఉన్న సొసైటీ ఖాతాలోకి మళ్లించారు. ఈ నేపథ్యంలోనే స్కామ్‌లో వారి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 10 ప్రభుత్వ బ్యాంకులకు చెందిన 30 బ్రాంచిల్లో ఎఫ్‌డీల రూపంలో తెలుగు అకాడమీ నిధులు ఉన్నాయి. అయితే, ఏ బ్రాంచ్‌లోనూ అకాడమీకి కరెంట్ అకౌంట్‌ లేదు. కరెంట్ అకౌంట్‌ తెరవకుండా నేరుగా ఎఫ్‌డీలు వేసినందున వాటి వివరాలు బ్యాంకు లావాదేవీల రికార్డుల్లో కనిపించవు. దీన్నే తెలివిగా ఉపయోగించుకున్న బ్రాంచ్‌ మేనేజర్ మస్తాన్ వలీ.. తెలుగు అకాడమీ ఎఫ్‌డీలను వేరే బ్యాంకుకు వక్రమార్గంలో దారి మళ్లించి కాజేశాడు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలుగు అకాడమీలో ఉన్న 213 కోట్ల రూపాయల నిధుల్లో.. ఆంధ్ర ప్రదేశ్ వాటా 125 కోట్లు ఇవ్వడానికి అకాడమీ సిద్ధమైంది. ఈ క్రమంలో వివిధ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లను విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సీసీఎస్ పోలీసుల ఇంటరాగేషన్‌లో మస్తాన్ వలీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఏడాదికోసారి ఎఫ్‌డీలను అకాడమీ రెన్యువల్ చేస్తుంది. ఈ ఏడాది కాలంలో ఆ డబ్బును లాభసాటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి, ఎఫ్‌డీల గడువు సమీపించేలోపు తిరిగి యథావిధిగా బ్యాంకులో జమ చేయాలనుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో, దారి మళ్లించిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్‌పై ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. హిమాయత్‌నగర్‌లోని అకాడమీ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ రికార్డులను పరిశీలించింది. అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి, అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌ఛార్జ్ రమేశ్‌తోపాటు ఇతర ఉద్యోగులను ప్రశ్నించారు. బ్యాంకుల నుంచీ సమాచారం తీసుకున్నారు.

తెలుగు అకాడమీ స్కామ్‌లో ఇంటి దొంగల పాత్ర కూడా ఉన్నట్లు సీసీఎస్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయా బ్యాంకుల అధికారులతో చేతులు కలిపి నిధులు కాజేసినట్లు గుర్తించారు. ఇప్పటికే, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్, అగ్రసేన్ బ్యాంక్ అధికారులను ప్రశ్నించిన పోలీసులు.. తెలుగు అకాడమీ ఉద్యోగుల పాత్రపై మరింత కూపీ లాగుతున్నారు.

Read also: Japanese Princess: ప్రేమ కోసం త‌న వార‌స‌త్వ భారీ సంప‌ద‌ను వ‌దులుకొని పెళ్లిపీటలెక్కబోతోన్న జపాన్ యువరాణి