Chittoor : ప్రేమంటూ యువతిని చంపి, తనూ గొంతుకోసుకుని.. స్పాట్‌లోనే ఆమె తమ్ముడి చేతిలో చనిపోయి.! : సుష్మిత, చిన్నా హత్యల ఉదంతం
అతని దౌర్భల్యానికి ప్రేమనే పేరుపెట్టుకుని ఉన్మాదిలా మారిపోయాడు. ఇష్టం లేదని వారించినా..
Spurned youth murders woman; killed by siblings : అతని దౌర్భల్యానికి ప్రేమనే పేరుపెట్టుకుని ఉన్మాదిలా మారిపోయాడు. ఇష్టం లేదని వారించినా తన మాటే నెగ్గాలి.. తనకే దక్కాలంటూ రాత్రనకా పగలనకా ఊగిపోయి, కక్షతో రేగిపోయి చివరికి ఆ అభాగ్యురాలని చంపేశాడు. తన ఉద్యోగం తాను చేసుకుని అలసి సొలసి ఇంటికొచ్చి నిద్రిస్తోన్న ఆమెపై పక్కా ప్రణాళిక ప్రకారం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతు, పొట్టలో పోట్లుపొడిచి చంపేశాడు. ఈ క్రమంలో భయంతో మరో డ్రామాకు తెరతీసి తనూ గొంతు కోసుకుని అక్కడే పడిపోయాడు. బయటకెళ్లి అప్పుడే ఇంటికొచ్చిన యువతి తమ్ముడు రక్తపు మడుగులో విగతజీవిగా మారిపోయిన తన చెల్లిని, గొంతుకోసుకుని సైకోలా నాటకమాడుతోన్న ఉన్మాది చూసి రగిలిపోయాడు. ఆవేశంతో యువతి తమ్ముడు.. ఉన్మాదిని ఇంటి బయటకు లాక్కొచ్చి రాయితో తలపై మోది చంపేశాడు. చిత్తూరులోని సాంబయ్యకండ్రిగలో ఈ రెండు హత్యల ఉదంతం చోటుచేసుకుంది.
సాంబయ్యకండ్రిగకు చెందిన వరదయ్య, లతకు సుష్మిత(22), సునీల్ సంతానం. సుష్మిత గుడిపాల మండలం చీలాపల్లి సీఎంసీలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది. వెనుక ఇంట్లోనే ఉంటున్న చిన్నా(24) ప్రేమించాలంటూ సుష్మితను కొన్నినెలలుగా వేధిస్తున్నాడు. దీంతో వేధింపులు తాళలేక ఆ యువతి ఈ ఏడాది జనవరిలో గుడిపాల పోలీస్‌స్టేషన్‌లో చిన్నా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో యువకుడు చిన్నా కొంతకాలం జైలులో ఉన్నాడు. అయితే, శుక్రవారం ఉదయం యువతి విధులు ముగించుకొని ఇంటికి వచ్చి నిద్రిస్తోంది.
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చిన్నా.. యువతి ఉంటున్న ఇంటి దాబా ఎక్కి లోపలకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో యువతిని రెండుసార్లు పొడిచాడు. దీంతో అక్కడిక్కడే కొట్టుకొంటూ ఘటనా స్థలంలోనే యువతి మృతి చెందింది. అనంతరం నిందితుడు కూడా స్పాట్ లోనే కత్తితో గొంతు కోసుకున్నాడు. బయటకు వెళ్లి వచ్చిన యువతి తమ్ముడు సునీల్.. చిన్నాను ఇంటి బయటకు తీసుకొచ్చి రాయితో తలపై కొట్టడంతో అతనూ మరణించాడు. ఈ క్రమంలో యువతి సోదరుడు సునీల్ పైనా కేసు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు ఆధ్వర్యంలో ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, గత జనవరి నుంచి యువతి ఫిర్యాదుపై పోలీసులు సరిగా స్పందించలేదని అందుకే ఈ దారుణాలు జరిగాయని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.