పుణెలో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. పోలీసునే బురిడి కొట్టించి రూ.1.3 లక్షలు కాజేశారు..
సాధారణంగా సైబర్ నేరగాళ్ల బారిన పడిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తారు.. కానీ ఇక్కడ పోలీసు అధికారే సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు.
సాధారణంగా సైబర్ నేరగాళ్ల బారిన పడిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తారు.. కానీ ఇక్కడ పోలీసు అధికారే సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు. ఆ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుని పెద్ద మొత్తంలో నగదు కోల్పోయాడు. వివరాల్లోకెళితే.. మహారాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా ఓ పోలీసు అధికారికే టోకరా వేశారు. బాధిత పోలీసు అధికారి ఖాతా నుండి నాలుగు రోజుల వ్యవధిలో 1.3 లక్షల సొమ్మును కాజేశారు. ఈ ఘటన పుణెలో చోటు చేసుకుంది. డేబిట్ కార్డు క్లోనింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై బాధిత పోలీసు అధికారి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో బాధిత పోలీస్ అధికారి ఏటిమ్ నుండి కొంత డబ్బును డ్రా చేశాడు. ఆ తరువాత అతని ఫోన్ రిపేర్ అవడంతో మొబైల్‌ను రిపేర్‌కు ఇచ్చాడు. అదే సమయంలో అతని డెబిట్ కార్డ్‌ను దుండగులు క్లోనింగ్ చేశారు. అయితే తాజాగా అతని ఫోన్ తిరిగి బాగవడంతో తన బ్యాంకు ఖాతా నుండి రూ. 1.3 లక్షల సొమ్ము డ్రా చేసినట్లు సందేశం వచ్చింది. ఇది చూసి కంగుతినడం ఆ అధికారి వంతైంది. చివరిసారి ఏటీఎమ్ నుండి నగదు డ్రా చేసిన సమయంలోనే తన వివరాలను క్లోనింగ్ చేసి ఉంటారని అనుమానించిన బాధిత పోలీసు అధికారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుపగా.. నవంబర్ 1వ తేదీ నుండి 4వ తేదీ మధ్య వివిధ ఏటీఎమ్ సెంటర్ల నుండి 33 సార్లు నగదును విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. దుండగులను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.