బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. కచ్చితమైన సమాచారంతో నిందితుల కోసం గాలింపు..

Boinpalli kidnapping case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులైన భార్గవరామ్‌, గుంటూరు శ్రీనులను పట్టుకునేందుకు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. కచ్చితమైన సమాచారంతో నిందితుల కోసం గాలింపు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 14, 2021 | 9:29 AM

Boinpalli kidnapping case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులైన భార్గవరామ్‌, గుంటూరు శ్రీనులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కచ్చితమైన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు. వీరికి సంబంధించిన కీలక ఆధారాలతో వెతుకుతున్నారు. భార్గవరామ్‌ మహారాష్ట్రలో, గుంటూరు శ్రీను కర్ణాటకలో ఉన్నట్లు కచ్చితమైన సమాచారం లభించడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. ఈ నెల 5న ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్‌ చేయించిన వీరిద్దరూ మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు.

అనంతరం వారిని వదిలేసి వేర్వేరు మార్గాల్లో హైదరాబాద్‌ దాటి పారిపోయారు. అనంతరం కొన్ని గంటలపాటు భార్గవరామ్‌, గుంటూరు శ్రీనులు ఫోన్లలో మాట్లాడుకున్నాక పోలీసులకు దొరకకూడదని తమ సిమ్‌కార్డులను పారేశారు. సాంకేతిక ఆధారాలతో వీరిద్దరూ కర్ణాటక, మహారాష్ట్రలలో ఉన్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు.కిడ్నాప్‌ వ్యవహారాన్ని ఆద్యంతం పర్యవేక్షించిన భార్గవరామ్‌, గుంటూరు శ్రీనులు ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన రోజు కారులో ఉన్నారా? ప్రవీణ్‌రావు ఇంట్లోకి వచ్చి అపహరించుకెళ్లారా? అన్న అంశాలపై పోలీసులు తాజాగా పరిశోధిస్తున్నారు.

కిడ్నాప్‌ జరిగిన రోజు వారిద్దరూ ఒకే కారులో ఉన్నారని పోలీసులు గుర్తించారు. భార్గవరామ్‌, అఖిలప్రియలు ఉపయోగిస్తున్న కార్లు, కిడ్నాపర్లు వినియోగించిన కార్ల నంబర్లను విశ్లేషించాక ఈ నిర్ణయానికి వచ్చారు. కీలక నిందితులు సహా మిగిలిన వారందరినీ రెండు రోజుల్లో అరెస్టు చేస్తామని సీపీ అంజనీకుమార్ ప్రకటించారు. భూమా అఖిలప్రియ కస్టడీ గురువారం మధ్యాహ్నంతో ముగుస్తుంది. ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచాక తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలిస్తామన్నారు. భూమా కుటుంబ కారు డ్రైవరుగా ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుః ప్రాథమిక విచారణలో బయటపడ్డ నిజాలు.. మాజీ మంత్రి అఖిలప్రియ దంపతులతోసహా పలువురి అరెస్ట్