Online Cheating: మోసపోయిన వారిని మళ్ళీ మోసగించిన ఆన్‌లైన్ ముఠా! వీరి తెలివికి మతి పోతుంది!
సైబర్ నేరగాళ్ళ తెలివితేటలూ మామూలుగా ఉండడం లేదు. ఆన్‌లైన్లో మోసాలు చేయడం కోసం వాళ్ళు వేస్తున్న ఎత్తులకు పోలీసులకే మతి పోతోంది. సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు కొత్తగా మారిపోతున్నాయి. ఒకసారి మోసపోయి..ఫిర్యాదు చేయడానికి వచ్చినవారిని మళ్ళీ మోసగించిన ముఠా ఒకటి పట్టుబడింది.
Online Cheating: దేశ రాజధానిలో, సైబర్ నేరగాళ్ల ప్రధాన ఆన్‌లైన్ చీటింగ్ స్థావరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఇద్దరు మహిళలు సహా 12 మంది సైబర్ దుండగులు ఈ స్థావరాన్ని నడుపుతున్నారు. ఈ ఆన్‌లైన్ మోసాల స్థావరాన్ని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లోని సైబర్ క్రైమ్ యూనిట్ ధ్వంసం చేసింది. ఈ స్థావరం నుంచి 7 ల్యాప్‌టాప్‌లు, 25 మొబైల్ ఫోన్ సెట్లు, ఒక కారు, 52 వేల 500 నగదును పోలీసు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ సైబర్ నేరగాళ్ల ముఠా ఇప్పటి వరకు దేశంలో సుమారు మూడు వేల మందిని దోచుకుని వారి నుంచి రెండున్నర కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు తెలిసింది.
ఈ మోసం ఇలా చేశారు..
సైబర్ నేరగాళ్ళు మామూలు తెలివితేటలూ ప్రదర్శించలేదు. ఈ దుండగులు జన్ సురక్ష కేంద్రం, ప్రజా ఫిర్యాదుల కేంద్రం (జన్‌శికాయత్ కేంద్రం), కస్టమర్ ప్రొటెక్షన్ సెంటర్ (గ్రాహక్ సురక్ష కేంద్రం), నయా భారత్ తదితర పేర్లతో నకిలీ వెబ్‌సైట్లను తెరిచారు. ఈ వెబ్‌సైట్‌ల పేర్లన్నీ చూసిన తర్వాత, చదివిన తర్వాత ఇవన్నీ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం తెరిచిన వెబ్‌సైట్‌లా కనిపిస్తాయి. ఇక్కడే ప్రజలు మోసపోతారు. ఈ వెబ్ సైట్లలో ఫిర్యాదుల విభాగం ఉంటుంది. ఏదైనా సైబర్ నేరానికి సంబంధించి ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు అని సైట్ లో చెబుతారు. దీంతో వినియోగదారులు ఆ ఫిర్యాదు పై క్లిక్ చేస్తారు. తరువాత వారి కంప్లైంట్ వివరాలు నమోదు చేస్తారు. ఫిర్యాదుతో పాటు కొంత ఫీజు కట్టాలని ఇందులో పేర్కొంటారు. దీంతో వినియోగదారులు ఆ ఫీజు ఆన్ లైన్ లో చెల్లిస్తారు. అంతే.. సొమ్ము ఈ దుండగులకు చేరిపోతుంది. ఫిర్యాదు చేశాం కదా అని వినియోగదారులు దాని జవాబు కోసం ఎదురుచూస్తారు. కానీ, ఎటువంటి రెస్పాన్స్ ఆ వెబ్ సైట్ ల నుంచి రాదు. ఇలా ఒక్కో వినియోగదారుని నుంచి 500 రూపాయలు మొదలుకుని 30 వేల వరకూ వసూలు చేశారు ఇప్పుడు పట్టుబడిన దుండగులు.
ప్రత్యక బృందంతో దర్యాప్తు..
ఈ సైబర్ నేరానికి సంబంధించి ఫిర్యాదులు రావడంతో సైబర్ నేరగాళ్లు నిర్వహించే ఆన్‌లైన్ మోసాల స్థావరాన్ని నాశనం చేయడానికి స్పెషల్ సెల్ అనేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాల్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) రామన్ లాంబా, ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ విజేందర్, సునీల్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అజిత్ అనిల్, హవల్దార్లు లలిత్, హరికృష్ణ, అతుల్ ఉన్నారు. ఈ నేరాలపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డిసిపి ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ పిఎస్ మల్హోత్రా పలు వివరాలను మీడియాకు వెల్లడించారు.
డిసిపి మల్హోత్రా చెప్పిన వివరాల ప్రకారం, “అరెస్టయిన 12 మంది సైబర్ దుండగులందరూ 20-22 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. వీరిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేవారు కూడా వీరిలో ఉన్నారు. అరెస్టయిన దుండగుల్లో ఎక్కువ మంది ఢిల్లీ, నోయిడా, ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని హైటెక్ సిటీలోని వివిధ ప్రాంతాల వాసులు. అరెస్టయిన సైబర్ దుండగులు ఫిర్యాదు నమోదు పేరుతో బాధితుల నుంచి సొమ్ము వసూలు చేసేవారు.
ఆన్‌లైన్ మోసం ఇలా బయటపడింది
ఈ దుండగులు డబ్బులు వసూలు చేయగానే ఆన్‌లైన్ వ్యవస్థ నుంచి మాయమయ్యేవారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఇలాంటి మోసానికి సంబంధించిన అన్ని ఫిర్యాదులను పోలీసులు గుర్తించారు. దీంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లోని సైబర్ క్రైమ్ యూనిట్ ఈ ఫిర్యాదుల మూలాన్ని స్వయంగా తెలుసుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సైబర్ క్రైమ్ యూనిట్ దర్యాప్తులో, ఈ ఫిర్యాదులు దాదాపు కోటి 74 లక్షల మోసానికి సంబంధించినవిగా తేలింది. ఈ ఆన్‌లైన్ సైబర్ నేరగాళ్లతో అరెస్టయిన ఇద్దరు మహిళా దుండగుల వయస్సు దాదాపు 22-23 ఏళ్లు. అరెస్టయిన మహిళా దుండగులు ఇద్దరూ కూడా నోయిడా వాసులే.
స్థావరాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బృందాలకు ఈ ముఠాలు ఒక్కో బాధితుడి నుంచి 500 నుంచి 30 వేల రూపాయల వరకు వసూలు చేసేవారని తెలిసింది. ఆన్‌లైన్ సైబర్ నేరగాళ్లు, ఈ ముఠా నిర్వాహకులు సాధారణ ప్రజలను మభ్యపెట్టేందుకు రూపొందించిన నకిలీ వెబ్‌సైట్‌లు చాలానే గుర్తించబడ్డాయి. వీటిలో పబ్లిక్ గ్రీవెన్స్ సెంటర్ (జన్ షికాయత్ కేంద్రం), కస్టమర్ ప్రొటెక్షన్ సెంటర్ (గ్రాహక్ సురక్ష కేంద్రం), నయా భారత్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. చూసినవెంటనే ఈ వెబ్‌సైట్‌లన్నింటి పేర్లు వాటిని ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఈ పేర్లను దుండగులు సామాన్యులను దోచుకునేందుకే ఉపయోగిస్తున్నారు.
ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. ఆన్లైన్ లో ఫిర్యాదుల కోసం ప్రభుత్వ సంస్థలు ఏవీ కూడా ఫీజులను వసూలు చేయవనే విషయాన్ని ప్రజలు గమనించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..
Rahul Gandhi: మోటర్ సైకిల్ టాక్సీపై రాహుల్.. గోవా ఎన్నికల ప్రచార పర్వానికి ముందు ఇలా..