AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Journalist Killings: 2020 కరోనా నామ సంవత్సరమే కాదు.. మరో పేరు కూడా సంపాదించింది.. ఏంటంటే?

కరోనా ప్రభావంతో నెలల తరబడి ఇళ్ళకే పరిమితమై ఇప్పుడిప్పుడు భయాన్ని దాచుకుంటూ బయటికి వస్తున్న వారికి 2020 ఓ చీకటి సంవత్సరంగానే గుర్తుండిపోతుంది. అయితే 2020కి మరో పేరు కూడా పెట్టుకునేలా కొన్ని గణాంకాలు ఇపుడు తెరమీదకి వస్తున్నాయి..

Journalist Killings: 2020 కరోనా నామ సంవత్సరమే కాదు.. మరో పేరు కూడా సంపాదించింది.. ఏంటంటే?
14
Rajesh Sharma
|

Updated on: Mar 13, 2021 | 3:46 PM

Share

More journalists killed in 2020 year: 2020 ముగిసి కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో ఎవరి నోట విన్నా 2020ని కరోనా నామ సంవత్సరంగా జీవితాంతం గుర్తుంచుకుంటామంటూ వ్యాఖ్యానించారు. కరోనా ప్రభావంతో నెలల తరబడి ఇళ్ళకే పరిమితమై ఇప్పుడిప్పుడు భయాన్ని దాచుకుంటూ బయటికి వస్తున్న వారికి 2020 ఓ చీకటి సంవత్సరంగానే గుర్తుండిపోతుంది. అయితే 2020కి మరో పేరు కూడా పెట్టుకునేలా కొన్ని గణాంకాలు ఇపుడు తెరమీదకి వస్తున్నాయి. గతంలో పోలిస్తే జర్నలిస్టుల హత్యలు విపరీతంగా పెరిగిన సంవత్సరంగా 2020 చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

సమాజంలో అవినీతి కలుపు మొక్కలను ఏరిపారేసే శ్రమజీవి జర్నలిస్టు. అలాంటి జర్నలిస్టు జీవితాలు తృణప్రాయంగా గాలిలో కలుస్తున్నాయి. జర్నలిస్టులకు 2020లో చీకటి రోజులే మిగిలాయి. కరోనాపై పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ఒకరైన జర్నలిస్టులు పలువురు కరోనా సోకి పెద్ద సంఖ్యలోనే మరణించారు. మరోవైపు వృత్తిపరమైన కారణాలతో ఎదురైన దాడుల్లో మరణించిన జర్నలిస్టుల సంఖ్య కూడా 2020లో బాగానే వుంది. 2019తో పోలిస్తే 2020లో హత్యకు గురైన జర్నలిస్టుల సంఖ్య బాగా పెరిగిపోయింది. 2019లో హత్యకు గురైన జర్నలిస్టుల శాతం 63 కాగా.. 2020 నాటికి 84 శాతానికి పెరిగింది. 2020లో దేశవ్యాప్తంగా మొత్తం 65 మంది జర్నలిస్టుల హత్య గావించబడ్డారు. ఇందులో అవినీతిపై పరిశోధన చేసిన జర్నలిస్టులు 10 మంది. నిరసనలను కవర్ చేసేందుకు వెళ్ళిన ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.

సిరియా, లిబియా, ఇరాక్‌ దేశాల్లో జర్నలిస్టుల పరిస్థితి అత్యం దయనీయంగా వుంది. జర్నలిస్టుల హత్యలో లాటిన్ అమెరికన్ కంట్రీ మెక్సికో టాప్‌ పొజిషన్‌లో వుంది. గత ఐదేళ్లలో వంద మంది జర్నలిస్టులు ఒక్క మెక్సికోలోనే హత్యకు గురయ్యారు. మెక్సికో డ్రగ్స్ పెడలింగ్‌కు పెట్టింది పేరు. అక్కడి డ్రగ్స్ మాఫియా జర్నలిస్టులే టార్గెట్‌గా హత్యాకాండ కొనసాగిస్తోంది. ఇక జర్నలిస్టుల హత్యల్లో పొరుగు దేశం అఫ్ఘానిస్తాన్‌ రెండో స్థానంలో వుంది. 2020లో అఫ్ఘానిస్తాన్‌లో ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. జర్నలిస్టుల హత్యల్లో ఆ తర్వాతి స్థానాల్లో అంటే మూడో స్థానంలో పాకిస్తాన్, నాలుగో స్థానంలో భారత్ వున్నాయి. అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్) గత సంవత్సరం ప్రకటించిన గణాంకాల ప్రకారం 2020లో ఎక్కువ మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. 2019తో పోలిస్తే 2020లో 17 హత్యలు ఎక్కువగా జరిగాయి. మొత్తం 16 దేశాల్లో జరిగిన జర్నలిస్టుల హత్యా సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ప్రభుత్వ చర్యలతో జైలు శిక్ష అనుభవిస్తున్న జర్నలిస్టుల సంఖ్య కూడా ఏ ఏటికాఏడు పెరిగిపోతూనే వుంది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా జైలు పాలైన జర్నలిస్టుల సంఖ్య 250. 1990లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌జే) ఆనాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా దాడులకు, హత్యలకు గురవుతున్న వారి లెక్కలను నమోదు చేస్తోంది. అదే సమయంలో ప్రభుత్వాల ఒత్తిళ్ళతో జైలు పాలవుతున్న జర్నలిస్టుల గణాంకాలను కూడా నమోదు చేస్తోంది. 1990 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,680 మంది జర్నలిస్టులు హత్యగావించబడ్డారు. పాకిస్తాన్, సొమాలియా, మెక్సికో, అఫ్ఘానిస్తాన్‌ దేశాలలో జర్నలిస్టుల పరిస్థితి మరీ దారుణంగా వుంది. ఇండియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా జర్నలిస్టులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత నాలుగేళ్ళుగా మెక్సికో దేశం జర్నలిస్టుల హత్యల్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

మెక్సికోలో 14 మంది జర్నలిస్టులు, అఫ్ఘానిస్తాన్‌లో 10 మంది, పాకిస్తాన్‌లో 9, ఇండియాలో 8, ఫిలిప్పీన్స్‌లో 4 మంది జర్నలిస్టుల హత్యకు గురయ్యారు. సిరియాలో 4 నైజీరియాలో 3, యెమెన్‌లో 3 చొప్పన జర్నలిస్టులు హత్య గావించబడ్డారు. పత్రికా స్వేచ్ఛ గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రతీ ఏటా సదస్సులు జరుగుతున్నాయి. మీడియా ప్రతినిధుల భద్రత గురించి దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలు మాట్లాడుతూనే వుంటాయి. ఏవైనా సంఘటనలు జరిగితే.. అప్పటికప్పుడు స్పందిస్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ అంతిమంగా జర్నలిస్టుల భద్రతపై పక్కా చర్యలు మాత్రం కరువయ్యాయి అనడానికి పెరుగుతున్న హత్యాకాండనే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ALSO READ: ప్రతిష్టాత్మక పబ్లిక్ రంగ సంస్థలకు ఆలవాలం తెలంగాణ.. అదంతా గత చరిత్రేనా?\

ALSO READ: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్ర ఆసక్తికరం.. రాజకీయాలు తక్కువైనా అదే ఉత్కంఠ