AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరంలో నరరూప రాక్షకుడు.. ఒంటరి మహిళలు కనిపిస్తే అంతే.. పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్

ఆ చీటీ.. ఏకంగా పదహారు మంది మహిళలను దారుణంగా కడతేర్చిన కరుడుగట్టిన హంతకుడిని పోలీసులకు పట్టించింది.

నగరంలో నరరూప రాక్షకుడు.. ఒంటరి మహిళలు కనిపిస్తే అంతే.. పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్
Balaraju Goud
|

Updated on: Jan 26, 2021 | 7:53 AM

Share

Man murdered 16 women : మహిళలను హత్య చేయడమే పనిగా పెట్టుకున్నా ఓ నరరూప రాక్షకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ నగర శివర్లాకు తీసుకెళ్లి హత్యలు చేసేవాడు. నరరూప హంతకుడిగా మారిన ఈ కిరాతకుడు ఏకంగా 16 మహిళలను హతమార్చాడు. కానీ చివరకు ఓ చీటీ కారణంగా అతడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

రాచకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి మొదటి వారంలో హైదరాబాద్ శివార్లలోని అంకుషాపూర్ సమీపంలో పోలీసులు సగం కాలిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో గాలించినా మృతురాలికి సంబంధించిన సమాచారం దొరకలేదు. మహిళ అనవాళ్లు కనిపించకుండా ముఖం మీద పెట్రోలు పోసి తగలబెట్టేయడంతో కేసు క్లిష్టంగా మారింది.

అయితే, ఆమె చీరకొంగుకు ఓ ముడి కనిపించింది. విప్పి చూస్తే అందులో చిన్న చీటీ.. దానిపై ఓ ఫోన్ నెంబర్ ఉంది. ఆ చీటీ.. ఏకంగా పదహారు మంది మహిళలను దారుణంగా కడతేర్చిన కరుడుగట్టిన హంతకుడిని పోలీసులకు పట్టించింది. చీటీ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. అది నేరేడ్‌మెట్‌కు చెందిన వ్యక్తిదిగా తేలింది. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. కాకపోతే.. ఆమె పేరు వెంకటమ్మ (50) అని, జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో నివాసముంటుందని తెలిపాడు.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల సాయంతో వెంకటమ్మ ఆచూకీ కోసం వాకబు చేశారు. జనవరి 1న వెంకటమ్మ అదృశ్యమైనట్లు జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఆరోజు మధ్యాహ్నం బేగంపేటలో ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఒకచోట ఆమె, మరో వ్యక్తితో కలిసి ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ఫోటోను మృతురాలి కుటుంబ సభ్యులకు చూపించారు. అతన్ని ఎప్పుడూ చూడలేదని వారు స్పష్టం చేశారు. మల్కాజిగిరికి చెందిన వ్యక్తి కూడా అతడెవరో తనకు తెలియదని చెప్పాడు. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చింది.

ఆ వ్యక్తి ఫొటోను పట్టుకుని రాచకొండ పోలీసులు నగరమంతా గాలించారు. చివరకు ఓ చేపల వ్యాపారి అతడిని గుర్తు పట్టాడు. బోరబండలో చూసినట్లు చిన్న క్లూ అందించాడు. ఇదే రాచకొండ పోలీసులకు పెద్ద ఆయువు అయ్యింది. పక్కాగా ఫ్లాన్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులే అవాక్కయ్యారు.

వెంకటమ్మ ఒక్కరినే కాకుండా.. కల్లు కాంపౌండ్లు, మద్యం దుకాణాలు, ఇతరత్రా ప్రదేశాల్లో ఒంటరిగా కనిపించిన చాలామంది మహిళలను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని రాచకొండ పోలీసులు తెలిపారు. పక్కా ఆధారాలతో వాస్తవాలను నిర్ధారించుకుని.. 16 మందిని హత్య చేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. విచారణ పూర్తయితే ఈ సంఖ్య మరింత పెరగవచ్చని కూడా భావిస్తున్నారు. డబ్బు కోసం చంపాడా లేక మరేదైనా కారణమా అనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఈ కేసుల వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని రాచకొండ పోలీసులు తెలిపారు.