Vizianagaram District: పాపం ఆడపిల్ల లిఫ్ట్ అడిగింది కదా అని ఇచ్చాడు… ఆపై చుక్కలు చూపించింది
బైక్ ఆపి లిఫ్ట్ అడిగింది. అతను..ఆమెను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లాక.. అతడికి ఊహించని షాక్ తగిలింది.
ఆమెకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. రోడ్డు పక్కన నిల్చుని ఉంది. అటుగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. ఆడపిల్ల.. ఒంటిరిగా ఉంది.. పాపం అనుకుని అతడు లిఫ్ట్ ఇచ్చాడు. ఇక్కడవరకు అంతా బాగానే ఉంది. కొద్ది దూరం వెళ్లాక తాను దిగాల్సిన ప్లేస్ ఇదే అంటూ బైక్ ఆపింది. అక్కడ దిగిన వెంటనే బైక్ నడుపుతున్న వ్యక్తి మెడలో ఉన్న బంగారు చైన్ లాక్కోని పరారయ్యింది. ఆ చైన్ దాదాపు మూడున్నర తులాలు ఉంటుంది. దీంతో బాధితులు ఏం చెయ్యాలో అర్థం కాక… కేకలు పెట్టాడు. గట్టిగా అరిచాడు. దీంతో ఆ పక్కన ఉన్న స్థానికులు ఆ యువతిని పట్టుకున్నారు. అతని బంగారాన్ని ఎట్టకేలకు ఇప్పించగలిగారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం వైపు నుంచి బైక్‌పై గజపతినగరం వస్తున్న పైనాన్స్ వ్యాపారి చింత సత్యనారాయణ రెడ్డిని గొట్లాం సమీపంలో సామంతుల లక్ష్మి అనే యువతి బైక్ లిఫ్ట్ అడిగింది. గజపతినగరం బ్రిడ్జి ముందు ఉండే దావాలపేట రోడ్డు సమీపంలో బైక్ ఆపి దిగింది. అదే సమయంలో సత్యనారాయణ రెడ్డి మెడలో మూడున్నర తులాలు చైన్ తెంపుకొని పారిపోయింది. సత్యనారాయణ రెడ్డి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు, సమీపంలో ఉన్నవారందరూ ఆమెను వెంబండించి పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమెపై గతంలోనూ చైన్ దొంగతనం కేసు ఉందని పోలీసులు తెలిపారు. లక్ష్మిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నట్లు గజపతినగరం సీఐ రమేష్ తెలిపారు.
కాగా ఇటీవలి కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఈ దారి దోపిడీ కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు పక్కా స్కెచ్‌తో దోపిడీలకు తెగబడుతున్నారు. ఇటీవల దారి దోపీడీల విషయంలో భారీ నేర చరిత్ర ఉన్న గంటా తులసి అనే మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టారు. ఆమెపై గతంలో 20 కేసులు ఉన్నట్లు తేలింది.
Also Read: దొంగగా మారిన కానిస్టేబుల్.. యూనిఫామ్‌లోనే దుస్తులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు