Guntur Gang Rape: వరుస అత్యాచారాలు, హత్యలు.. గుంటూరు జిల్లాలో హడలిపోతున్న మహిళలు
గుంటూరు జిల్లా గ్యాంగ్ రేప్ కేసులో 8మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా గ్యాంగ్ రేప్ కేసులో అసలేం జరిగింది? పోలీసులు సకాలంలో స్పందించలేదా? తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ బాధితులను అటూఇటు తిప్పారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జీరో ఎఫ్ఐఆర్ ఫెసిలిటీ ఉన్నప్పటికీ అర్ధరాత్రి బాధతులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి తొమ్మిదిన్నర సమయంలో బాధితులపై దాడి జరిగింది. బాధితురాలికి దాదాపు మూడు గంటలపాటు దుండగులు నరకం చూపించారు. ఇన్సిడెంట్ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బాధితులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అయితే, పాలడుగు తమ పరిధి కాదంటూ అర్ధరాత్రి మూడున్నర సమయంలో మేడికొండూరు పీఎస్ కు తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే, సత్తెనపల్లి డీఎస్పీ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. పోలీసులు వేగంగా స్పందించారని అంటున్నారు. బాధితులు సత్తెనపల్లి పీఎస్ కి రాగానే… మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. పోలీసుల తీరును విపక్ష నేతలు, ప్రజలు తప్పుబడుతున్నారు. జీరో ఎఫ్ఐఆర్ ఫెసిలిటీ ఉన్నా ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో వరుసగా దారుణాలు జరుగుతోన్న వాటిని అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని అంటున్నారు.
గ్యాంగ్ రేప్ కేసులో 8మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ఒడిషా, విజయనగరం కూలీలు. పాలడుగులో నిర్మిస్తోన్న కోల్డ్ స్టోరేజీల్లో పనిచేస్తున్నారు. అయితే, గ్యాంగ్ రేప్ వీళ్ల పనా? లేక తెలిసినవాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వరుస దారుణాలతో గుంటూరు జిల్లా ప్రజలు హడలిపోతున్నారు. వరుస అత్యాచారాలు, హత్యలు మహిళలను కలవరపెడుతున్నాయి. భర్త కళ్లెదుటే భార్యపై నలుగురు అగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో మహిళలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు.
గ్యాంగ్ రేప్ ఘటనతో స్థానికులు హడలిపోతున్నారు. పాలడుగు-సత్తెనపల్లి ప్రధాన రహదారిపై పోకిరీల బెడదగా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. రాత్రిపూట చెట్ల కింద ఉంటూ మహిళలపై వేధింపులకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అంటున్నారు.
Also Read: : పాపం ఆడపిల్ల లిఫ్ట్ అడిగింది కదా అని ఇచ్చాడు… ఆపై ఊహించని సీన్