Kerala HC: విడాకులపై కేరళ హైకోర్టు కీలక తీర్పు.. అలా చేయడం క్రూరత్వమే అవుతుందని వ్యాఖ్య
వివాహం విఫలమైందన్న వాస్తవాన్ని ఒప్పించినప్పటికీ.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడానికి నిరాకరించడం క్రూరత్వమే అవుతుందని కేరళ హై కోర్టు (Kerala Court) తీర్పు వెల్లడించింది.
వివాహం విఫలమైందన్న వాస్తవాన్ని ఒప్పించినప్పటికీ.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడానికి నిరాకరించడం క్రూరత్వమే అవుతుందని కేరళ హై కోర్టు (Kerala Court) తీర్పు వెల్లడించింది. దంపతులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ఏ.ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సోఫీ థామస్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. ఈ వ్యాఖ్యలు చేసింది. విడాకులు కావాలంటూ నెడుమంగడ్(Nedumangad) న్యాయస్థానంలో భర్త పిటిషన్ దాఖలు చేయగా.. అతని అభ్యర్థనను న్యాయస్థానం సమర్థించింది. అయితే నెడుమంగడ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ భార్య కేరళ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. తన గర్భధారణ సమయంలో సంరక్షణ అందించడంలో తన భర్త విఫలమయ్యాడని పిల్ లో పేర్కొంది.
ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. అభిప్రాయ భేదాల కారణంగా భార్యాభర్తలు అర్ధవంతమైన వైవాహిక జీవితాన్ని గడపలేనప్పుడు, వారు విడాకులు తీసుకునేందుకు దంపతుల్లో ఎవరో ఒకరు అడ్డు తగలడం క్రూరత్వం అవుతుందని వ్యాఖ్యానించింది. ఇరువురి మధ్య ఏర్పడిన విభేదాలు సర్దుబాటు చేయగలిగే స్థితిలో లేనప్పుడు బంధం కొనసాగించడం కష్టమవుతుంది. సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత, వైవాహిక బంధం చెడిపోవడానికి భార్యను పూర్తిగా నిందించలేమని పేర్కొంది. తన భార్య ప్రవర్తన భరించలేనిదిగా ఉందని పేర్కొన్న భర్త వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. దంపతుల్లో ఒకరి ప్రవర్తన మరొకరికి బాధ కలిగిస్తే అది విడాకులకు దారి తీస్తుందని తెలిపింది. వారిద్దరూ చిన్న వయసులో ఉన్నారని, 2017 నుంచి విడివిడిగా జీవిస్తున్నారని పేర్కొంటూ దంపతులకు ఇచ్చిన విడాకులను న్యాయస్థానం సమర్థించింది.
Also Read
మాయమాటలు చెప్పి.. కొండపైకి తీసుకెళ్లారు.. ఎవరూ లేని సమయంలో..??
AP Crime: ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తన.. విద్యార్థినులతో వెకిలి చేష్టలు