Sea cucumber: రూ.8 కోట్ల విలువైన సముద్ర జీవులు స్వాధీనం.. అక్రమంగా శ్రీలంకకు తరలిస్తుండగా..
Indian Coast Guard : సముద్ర జీవుల అక్రమ రవాణాకు సంబంధించిన ముఠాను ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం పట్టుకుంది. గత కొన్ని రోజుల నుంచి రెక్కి నిర్వహించి రూ.8 కోట్ల
Indian Coast Guard : సముద్ర జీవుల అక్రమ రవాణాకు సంబంధించిన ముఠాను ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం పట్టుకుంది. గత కొన్ని రోజుల నుంచి రెక్కి నిర్వహించి రూ.8 కోట్ల విలువైన సముద్ర జీవులను కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు అటవీశాఖ, సముద్రతీర రక్షక దళం సంయుక్తంగా సుమారు రూ.8 కోట్ల విలువైన సముద్ర జీవులను (సీ కుకుంబర్) స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న జీవులు రెండు టన్నులు ఉంటాయని తెలిపారు. ఈ సముద్ర జీవులను అక్రమంగా శ్రీలంకకు తరలిస్తున్నారని సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తమకు అందిన రహస్య సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం రెక్కి నిర్వహించిందని తెలిపారు.
ఈ క్రమంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాల్క్ బే ప్రాంతాలలో కోస్ట్ గార్డ్ బృందాలు అనుమానాస్పదంగా కనిపించిన నావను గుర్తించి అడ్డుకుందని తెలిపారు. అనంతరం తనిఖీలు చేపట్టగా.. ఆ నావలో 200 డ్రమ్ములలో రెండు వేల కిలోల సీ కుకుంబర్ జీవులు ఉన్నట్లు గుర్తించామన్నారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి ఖరీదు రూ. 8 కోట్ల వరకూ ఉండవచ్చని కోస్ట్‌గార్డ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నావ పంబన్ సమీపంలో అధికారులకు కనిపించిందని.. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారని తెలిపారు.
సముద్రంలో జీవించే సీకుకుంబర్‌లు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. అవి పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భారతదేశంలో సీకుకుంబర్ జీవులను 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ 1 ప్రకారం.. అంతరించిపోతున్న జాతిగా పరిగణిస్తారు. చైనా, ఆగ్నేయాసియా దేశాల్లో సీకుకుంబర్ జీవులను అధిక డిమాండ్ ఉంది. ఆ దేశాల్లో వీటిని ఆహారంగా, పలు డ్రగ్స్‌లల్లో ఉపయోగిస్తారు.
Also Read: