ప్రాణం తీసిన అక్రమ దందా.. నిల్వ ఉంచిన రసాయనాలతో విషవాయువులు.. ఉపిరాడక నలుగురు మృతి!
Illicit Liquor Death: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్రమ మద్యం తయారు చేస్తూ నలుగురు మృత్యువాత పడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్రమ మద్యం తయారు చేస్తూ నలుగురు మృత్యువాత పడ్డారు. మొరదాబాద్ జిల్లాలోని రాజ్‌పూర్ కెసారియాలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తుండగా విషపూరిత వాయువులు వెలువడ్డాయి. దీంతో వారంతా ఉపిరాడక అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
రాజ్‌పూర్ కెసారియా గ్రామానికి చెందిన రాజేంద్ర సింగ్ గత కొంతకాలంగా అక్రమ మద్యం తయారు చేస్తున్నాడు. ఇందుకోసం తన ఇంటి బేస్‌మెంట్‌లో ఓ గదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే క్రమంలో మంగళవారం రాజేంద్ర సింగ్‌తోపాటు అతని ఇద్దరు కుమారులు, ఓ కూలీ అందులోకి మద్యం తయారీకి వెళ్లారు. అయితే, అక్కడ ఆవు పేడ, రసాయన పదార్థాలు నిలువ ఉంచుతారు. దీంతో విషపూరిత వాయువులు వెలువడ్డాయి. వీటిని పీల్చుకున్న నలుగురు ఉపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని గమనించిన రాజేంద్ర సింగ్ భార్య పూల్వతి ఇరుగుపొరుగువారి సాయంతో రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే వారు మృతిచెందారు.
కాగా, ఏడాది క్రితం రాజేంద్ర సింగ్ ఇంట్లో 250 బాక్సుల అక్రమ మద్యం లభించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా అతడు అదే పనిచేస్తున్నాడని మొరదాబాద్ ఎస్‌ఎస్‌పీ పవన్ కుమార్ వెల్లడించారు. విషపూరిత వాయువులు పీల్చుకోవడంతోనే నలుగురు మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పవన్ కుమార్ తెలిపారు.
Read Also….
తాలిబన్లతో భారత అధికారుల ‘రహస్య’ సమావేశం…….ప్రభుత్వ ప్రకటనకై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్
Husband Shocked: ఘనంగా కొత్త జంట వివాహం.. రెండు నెలల తర్వాత భర్తకు ఊహించని షాక్.. అసలేమైందంటే?