Hyderabad: మొబైల్ దొంగల గుట్టు రట్టు.. 4 ముఠా గ్యాంగ్‌ల నుంచి 92 సెల్‌ఫోన్లు స్వాధీనం..
ప్రజల దృష్టి మళ్లించి చాకచక్యంగా సెల్‌ఫోన్లను దొంగలిస్తోన్న నాలుగు ముఠాలను ఈస్ట్, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 9 మంది నిందితుల నుంచి 92 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజల దృష్టి మళ్లించి చాకచక్యంగా సెల్‌ఫోన్లను దొంగలిస్తోన్న నాలుగు ముఠాలను ఈస్ట్, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 9 మంది నిందితుల నుంచి 92 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 12 లక్షలకు పైగానే ఉంటుందని, త్వరలోనే సంబంధిత బాధితులకు అందజేస్తామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన ఈ నాలుగు ముఠా గ్యాంగ్‌ల వివరాలు వెల్లడించారు. నగరంలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన మహ్మద్ అలీ, మహ్మద్ ఖాన్, అమీర్ ఖాన్‌లకు గతంలోనే నేరచరిత్ర ఉంది. వీరు గతేడాది జైలు నుంచి విడుదలై ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆటోలను కిరాయికి తీసుకొని చాక చక్యంగా సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నారు. అమీర్ ఆటో నడుపుతుంటే మిగతా ఇద్దరు ఆటోలో ప్రయాణికులుగా కూర్చుంటారు. ఇతర ప్యాసింజర్స్ ఆటో ఎక్కగానే దృష్టి మళ్లించి సెల్‌ఫోన్లను దొంగిలిస్తారు. ఈ ముఠాపై కంచన్‌బాగ్, డబీర్‌ఫురా, కాలాపత్తార్, చాదర్‌ఘాట్‌లో రెండు, రాయదుర్గం, మైలార్‌దేవ్‌పల్లిలో రెండు కేసులు, మారేడ్‌పల్లిలో ఒక కేసు నమోదైంది. ఈ ముఠా నుంచి మొత్తం 26 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
చెడు అలవాట్లకు బానిసై.. చోరీలకు ఇక మైలార్‌దేవ్‌పల్లికి చెందిన మహ్మద్ మెహసిన్ కూడా 2013 నుంచి వివిధ నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. గతేడాది ఫలక్‌నుమా పోలీసులు అతనిపై పీడీయాక్ట్ ప్రయోగించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జైలు నుంచి బయటకు వచ్చిన మెహసిన్ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ మూసతో కలిసి సెల్‌ఫోన్లు, రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగతనాలకు పాల్పడ్డాడు. వీరిపై చాంద్రాయణగుట్టలో మూడు కేసులు నమోదు కాగా, మీర్‌చౌక్, చార్మినార్, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఒక్కో కేసు నమోదైంది. ఈ ముఠాలోని నిందితుల నుంచి మొత్తం 14 ఫోన్లు రికవరీ చేశారు. సంతోష్‌నగర్‌కు మహ్మద్ అబ్దుల్ హాజీ, మహ్మద్ రఫీక్ ఫ్రెండ్స్. వీరు చెడు అలవాట్లకు బానిసై ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. రాత్రి వేళల్లో ఇళ్లలోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు తస్కరిస్తున్నారు. ఈ ముఠాపై డబీర్‌పురా, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో రెండు దొంగతనం కేసులు నమోదయ్యాయి. కాగా పోలీసులు వీరి నుంచి 28 సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పహాడీషరీఫ్‌కు చెందిన మహ్మద్ మన్సూర్, దస్తగిరిలకు గతంలో నేర చరిత్ర ఉంది. 2021లో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు వీరిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. బయటకు వచ్చిన తర్వాత ఆటోను అద్దెకు తీసుకొని ప్రయాణికుల సెల్‌ఫోన్లు అపహరిస్తున్నారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి 24 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
బాధితులకు అందిస్తాం.. ఐఎంఈఐ నంబర్‌తో సెల్‌ఫోన్ దొంగలను పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో మొబైల్ ఫోన్లను విడిభాగాలుగా చేసి విక్రయిస్తున్నారు. దొంగలించిన సెల్‌ఫోన్లను ఆన్ చేయకుండా అలాగే ఉంచి వాటి మదర్‌బోర్డు, కెమెరా, టచ్‌స్క్రీన్, కీ బోర్డు.. ఇలా ఒక్కో విడి భాగాన్ని విడిగా అమ్మేస్తున్నారు. ఈ నాలుగు ముఠాలపై ఇప్పటి వరకు మూడు పోలీస్ కమిషనరేట్లలో మొత్తం19 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 92 సెల్‌ఫోన్లను సంబంధిత బాధితులకు అందజేస్తామని సీపీ తెలిపారు.