Double Bed Room: సామాన్యుడి అమాకత్వమే వారి పెట్టుబడి.. పత్రాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. లక్షల్లో వసూళ్లు..!
సొంతింటి కలను ఆయుధంగా మలచుకున్నారు. పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని... ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
Double Bed Room Cheaters Arrest: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం. సొంతింటి కలను ఆయుధంగా మలచుకున్నారు. పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని… ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. గతంలోనే ఇలాంటి కేసులు నమోదుకాగా.. తాజాగా అమాయక ప్రజలను మోసగించిన వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసే రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామంటూ హైదరాబాద్‌లో పలువురు అమాయకుల నుంచి రూ.లక్షల్లో దండుకున్నారు. చివరికి బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ వివరాలను వెల్లడించారు. బొమ్మిడాం కుమార్, షేక్ సల్మాన్‌లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని బోరబండ, కూకట్‌పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో పలువురి వద్ద భారీగా డబ్బులు వసూలు చేశారు. ఇళ్లు కేటాయించినట్టు నకిలీ పత్రాలు సృష్టించి ఒక్కో బాధితుడి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ. 6.50 లక్షల వరకు వసూలు చేసినట్టు డీసీపీ పద్మజ తెలిపారు.
ప్రధాన నిందితుడు కుమార్.. పేరు మార్చుకుని నకిలీ ఐడీ కార్డుతో హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌లో అధికారినని నమ్మించాడు. అధికారిని నేను అంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. డబుల్ బెడ్‌రూమ్ ఇవే అంటూ ఫేక్ ధృవపత్రాలను చూపించాడు. అందినకాడికీ ఇద్దరు కలిసి దండుకున్నారు. వీరి వలలో నిరు పేదలు, కూలీనాలి పనులు చేసుకునేవారు, చిరు ఉద్యోగులు చిక్కుకున్నారు. వీరి బారినపడి ఇప్పటివరకు 100 మంది వరకు మోసపోయి ఉంటారని బాలానగర్ డీసీపీ తెలిపారు.
నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.37లక్షల నగదు, 30 తులాల బంగారం, స్కోడా కారు, రూ.లక్ష విలువ చేసే బజాజ్ పల్సర్ బైక్, 5 నకిలీ ఫ్లాట్ పత్రాలు, 3 మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 2 స్టాంపులు, ఒక కలర్ ప్రింటర్, 2 టోకెన్ బుక్స్, 18 నకిలీ పాస్‌బుక్‌లు, నకిలీ ఆధార్‌కార్డులు, పాన్ కార్డులు, డిప్యూటీ ఏఈ నకిలీ ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌వోటీ శంషాబాద్, సైబరాబాద్ పోలీసులు సంయుక్తగా ఈ కేసును ఛేదించారని, ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు. బొమ్మిడాం కుమార్, షేక్ సల్మాన్‌లు గతంలో 13 కేసుల్లో నిందితులుగా ఉన్నారని డీసీపీ వెల్లడించారు. ఇలా తప్పుడు మాటలతో మోసం చేసేవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అడ్డదారిలో ప్రభుత్వం పథకాలు అందిస్తామన్న వారి వివరాలను అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.