Crime News: పదేళ్ల బాలుడి ప్రాణం తీసిన స్టంట్.. ఫోన్‌లో వీడియో చూసి స్కిప్పింగ్ చేస్తుండగా..
పదేళ్ల బాలుడు స్టంట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. స్కిప్పింగ్ తాడు మెడకు చుట్టుకొని ఊపిరాడక మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Delhi Boy Dies Skipping Rope Accident: బాలుడు నిత్యం స్టంట్లు చేస్తుండేవాడు.. తాజాగా ఓ వీడియోలో చూసిన స్టంట్‌ను అలాగే చేయాలని నిర్ణయించుకున్నాడు. స్టంట్ చేస్తూ చివరకు ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడు స్టంట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. స్కిప్పింగ్ తాడు మెడకు చుట్టుకొని ఊపిరాడక మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని కర్తార్ నగర్ ప్రాంతంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగింది. స్పృహ తప్పి పడిపోయి ఉన్న బాలుడిని గమనించిన తల్లి.. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యలు వెల్లడించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
బాలుడు చాలా రకాల స్టంట్ వీడియోలు చూసేవాడని.. అలాగే ఓ వీడియో చూసిన అతను బుధవారం సాయంత్రం అతను ఒక గదిలోకి వెళ్లాడని పోలీసులు తెలిపారు. స్కిప్పింగ్ చేస్తూ.. స్టంట్ చేయడానికి ప్రయత్నించాడని.. స్కిప్పింగ్ తాడు అతని మెడకు చుట్టుకొని ఊపిరాడక స్పృహతప్పి పడిపోయాడని తెలిపారు. వెంటనే గమనించిన బాలుడి తల్లి, చుట్టుపక్కల వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించిందని అధికారి తెలిపారు.
ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కావున ఎటువంటి కేసు నమోదు చేయలేదని, CrPC సెక్షన్ 174 కింద దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తుండగా, అతని భార్య గృహిణి అని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..6