Cyberabad police: ట్విట్టర్‌పై రెండో కేసు నమోదు.. భారీ షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలు మే 25 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి యూజర్ల అభ్యంతరకరమైన పోస్టులపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వానికి, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరింత రంజుగా మారుతోంది. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకుగాను ట్విట్టర్‌కు ఇప్పటివరకూ లభిస్తున్న జవాబుదారీతనం నుంచి మినహాయింపును కోల్పోయింది. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకు గానూ కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలు మే 25 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి యూజర్ల అభ్యంతరకరమైన పోస్టులపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సైబరాబాద్ పోలీసుల కేసు..
ఇందులో భాగంగా ట్విట్టర్ పిట్టపై దేశంలోనే రెండోవ కేసు హైదరాబాద్‌లో నమోదైంది.ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నందుకుగాను ఈ కేసును నమోదు చేశారు. కేసు నమోదు చేసి.. ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఫేక్ వీడియోపై వస్తున్న అనుచిత కామెంట్లకు ట్విట్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. నటి మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై ట్విట్టర్ వెంటనే స్పందించాలి అని నోటీసులో కోరారు. నోటీసుతోపాటు ట్విట్టర్ మరో ఇద్దరి వివరాలు కావాలంటూ కోరారు. పోలీసులను కించపరిచేలా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరూ యువకుల వివరాలను అందించాలని ట్విట్టర్‌కు రాసిన లేఖలో కోరారు.
ట్విట్టర్‌పై తొలి కేసు…
ఇదిలావుంటే ఇప్పటికే తొలి కేసు ఉత్తర్ ప్రదేశ్‌లో నమోదైంది. థర్డ్ పార్టీ కంటెంట్ కలిగి ఉన్నదంటూ ఉత్తరప్రదేశ్‌లో ట్విటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 5న ఓ ముస్లిం వ్యక్తిపై కొందరు యువకులు దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఘజియాబాద్ పోలీసులు ట్విటర్, కొందరు జర్నలిస్టులు, కొందరు రాజకీయ నాయకులపై FIR నమోదు చేశారు. వారిపై IPC సెక్షన్ 153, 153ఏ,295 ఏ,505,120బి, 34 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ట్విటర్ తొలగించలేదని FIRలో పోలీసులు పేర్కొన్నారు.