Black magic: ఆ గ్రామంలో అడుగు బయటపెట్టని జనం.. క్షుద్రపూజల కలకలం.. రాత్రిళ్లు కోళ్లు బలి
రెండు రోజులుగా ఆ గ్రామ ప్రజలు కనీసం బయటకు కూడా రావట్లేదు. ఆ గ్రామ ప్రజలను భయం వెంటాడుతోంది. ఆ ఊరి పేరే కదంబాపూర్. చంద్రమండలంలోకి...
రెండు రోజులుగా ఆ గ్రామ ప్రజలు కనీసం బయటకు కూడా రావట్లేదు. ఆ గ్రామ ప్రజలను భయం వెంటాడుతోంది. ఆ ఊరి పేరే కదంబాపూర్. చంద్రమండలంలోకి అడుగిడుతున్న ఈ కాలంలో కూడా ఇంకా జనం మూఢనమ్మకాల ఊబి నుంచి బయటకు రావట్లేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో క్షుద్రపూజల కలకలంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అశోక్‌నగర్ సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్ వద్ద రాత్రిపూట కోడిని బలిచ్చారు. నిమ్మకాయలు, కోడిగుడ్డు, అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి క్షుద్ర పూజలు చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఊరిబయట అర్ధరాత్రి క్షుద్రపూజలు, చేతబడి చేయడంతో రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలంటే కూడా భయాందోళన చెందుతున్నారు. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లేవాళ్లు కూడా హడలిపోతున్నారు.
ముఖ్యంగా ఆదివారం, గురువారాలు వచ్చాయంటే చాలు ఏదో ఒకచోట క్షుద్ర పూజలు, చేతబడి చేస్తున్నారు. ఆషాఢమాసంలో క్షుద్రపూజలు, చేతబడి ఆనవాళ్లు ఎక్కువగా కనపడుతున్నాయి. అనుకోకుండా వాటిపై నుంచి దాటడంతో అనారోగ్యానికి గురవుతామని అనుమానంతో జనం భయపడిపోతున్నారు. ఈ ఘటనపై అటు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా మంత్రగాళ్లు క్షుద్రపూజలు, చేతబడి పూజలు చేయడం మానడం లేదు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా.. ఇంకా మంత్రాలు, క్షుద్రపూజలు అంటూ ఎక్కడికి వెళ్తున్నామని విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా కరోనాకు మందు కనిపెడుతున్న ఈ రోజుల్లో ఇంకా మూఢ నమ్మకాల ఊబిలో ప్రజలు మునిగిపోతున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్న వారిని పట్టుకుని, కేసు నమోదు చేయాలని, మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. లేదా రోడ్లు కలిసే కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు పెట్టి ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ల ఆట కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఏకంగా తెలంగాణ డీజీపీ ఫొటోతోనే చీటింగ్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు