ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై రాళ్ల దాడి.. పరిస్థితి ఉద్రిక్తత

ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై రాళ్ల దాడి.. పరిస్థితి ఉద్రిక్తత

కర్ణాటకలోని డి.జె.హళ్లిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అల్లుడు సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Balaraju Goud

|

Aug 12, 2020 | 9:56 AM

కర్ణాటకలోని డి.జె.హళ్లిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అల్లుడు సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ ఆందోళకారులు ఆగ్రహంతో శ్రీనివాసమూర్తి ఇంటిపై రాళ్లదాడి చేశారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఆందోళనకారుల రాళ్లదాడిలో 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 147 మందిని అదుపులోకి తీసుకున్నామని బెంగళూరు సీపీ వెల్లడించారు. సామాజిక మాధ్యమంలో వివాదాస్పద పోస్టు పెట్టిన ఎమ్మెల్యే బంధువు నవీన్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఉద్రిక్తతల నేపథ్యంలో డి.జె.హళ్లి, కె.జె.హళ్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్టు సీపీ తెలిపారు.

అటు, ఆందోళనకారులు డీజేహళ్లి, కేజేహళ్లి పోలీస్‌స్టేషన్లపై దాడి చేశారు. డీసీపీ వాహనానికి నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు కూడా విసిరారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఘటన మీద కర్నాటక సీఎం యడియూరప్ప స్పందించారు. పరిస్థితిని అదుపు చేయాలని పోలీసులను ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని ఆందోళనకారులకు సూచించారు.

ఈ వ్యవహారంపై రియాక్టైన ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి – సంయమనం పాటించాలని కోరారు. తప్పు చేసినవారికి న్యాయమార్గంలో తగిన గుణపాఠం చెబుతామన్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని, మీ వెంటే నేనుంటా అంటూ శ్రీనివాసమూర్తి – ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కర్నాటక హోంమంత్రి బస్వరాజ్‌ బొమ్మై కోరారు. ఆందోళనకారులు – చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను పంపామని కర్నాటక హోంమంత్రి వెల్లడించారు. ఎవరూ ఆవేశపడి విధ్వంసానికి దిగవద్దని మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. ఓ వర్గాన్ని కించపరిచేలా పోస్టు పెట్టినవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu