US Music Festival: మ్యూజిక్ ఫెస్టివల్‌లో మరణ మృదంగం.. తొక్కిసలాటలో 8 మంది మృతి.. 300 మందికి పైగా గాయాలు..
అమెరికాలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గందరగోళ పరిస్థితులు, తొక్కిసలాట కారణంగా సుమారు 8 మంది మృత్యువాత పడ్డారు
అమెరికాలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గందరగోళ పరిస్థితులు, తొక్కిసలాట కారణంగా సుమారు 8 మంది మృత్యువాత పడ్డారు. 300మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో భాగంగా ప్రముఖ అమెరికన్ ర్యాప్ సింగర్ ట్రెవిస్ స్కాట్ స్టేజిపైకి రాగానే జనం ఒక్కసారిగా వేదికపైపునకు దూసుకెళ్లారు. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే క్రమంలో తొక్కిసలాట జరిగిందని హ్యూస్టన్ నగర ప్రధాన అగ్నిమాపక శాఖ అధికారి శ్యామ్యూల్ ఘటన వివరాలను వెల్లడించారు.
‘స్కాట్ వేదికపైకి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలోనే కొందరికి గాయాలయ్యాయి. మరికొందరు కిందపడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మంది మృతులను గుర్తించాం. మరో 17 మందిని ఆస్పత్రులకు తరలించాం…వారిలో 11 మంది గుండెపోటుకు గురైనట్లు తెలిసింది. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేవరకు పూర్తి మరణాలను నిర్ధారించలేం. ఇక ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, కారణాలను అన్వేషిస్తున్నాం. ఇందుకోసం సంఘటనా స్థలంలోని వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నాం ‘ అని శ్యామ్యూల్ చెప్పుకొచ్చారు. ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌కు సుమారు 50వేల మంది హాజరైనట్లు సమాచారం. అయితే తొలిరోజు తొక్కిసలాట జరగడంతో రెండోరోజు మ్యూజిక్ ఫెస్టివల్‌ను రద్దు చేశారు.
Also Read: