Delta – Kappa: భారత్‌లో గుర్తించిన కరోనా వేరియంట్లకు కొత్త పేర్లు…ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన
భారత్‌లో మొదటిసారిగా గుర్తించిన కరోనా వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కొత్త పేరును సూచించింది. దీనికి డెల్టా (Delta) గా నామకరణం చేసింది.
భారత్‌లో తొలుత గుర్తించిన కరోనా వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కొత్త పేరును సూచించింది. మొదట గుర్తించిన వేరియంట్‌కు డెల్టా (Delta) గా నామకరణం చేసింది. ఇకపై అన్ని దేశాలు ఈ వేరియంట్‌కు సంబంధించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా ఈ పేరును ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే చైనా వైరస్, యూకే వేరియెంట్ అని ఇక పిలవడానికి వీల్లేదు. ఏ దేశంలో మొదట ఏ వేరియెంట్ కనపడితే ఆ దేశం పేరు పెట్టకూడదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. వైరస్ కు ఇలా దేశాల పేర్లు పెట్టడం వలన కొత్త సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికే తమ దేశంలో తొలుత గుర్తించిన కరోనా వైరస్‌ను చైనా వైరస్ అని పిలవడం పట్ల ఆ దేశం అభ్యంతరం తెలిపింది. అటు యూకే వేరియెంట్ అనడాన్ని బ్రిటన్ తప్పుబట్టింది. సింగపూర్‌లో గుర్తించిన కొత్త వేరియెంట్‌ను సింగపూర్ వేరియంట్ అనడాన్ని ఆ దేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఆ దేశం స్పందించడంతో..చివరకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వివరణ ఇవ్వడంతో సింగపూర్ శాంతించింది.
అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఇండియన్ వేరియంట్ వల్ల తమ దేశానికి ముప్పు ఉందని చాలా దేశాలు ఆరోపించాయి. తొలుత భారత్‌లో గుర్తించిన వేరియంట్‌ను ఇండియన్ వేరియంట్‌గా కొన్ని దేశాలు పిలవడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇండియన్ వేరియంట్ అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్స్‌ను తొలగించాలని కూడా దిగ్గజ సోషల్ మీడియా సంస్థలు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను భారత సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది.
బ్రిటన్, సౌతాఫ్రికా, బ్రెజిల్ దేశాలు కూడా కొత్త వేరియంట్లకు తమ దేశాల పేర్లు పెట్టడం పట్ల అభ్యంతరం తెలిపాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్‌ను… చైనా వైరస్ అని పిలవడంపై ఆ దేశాల మధ్య రగడ కొనసాగింది. ట్రంప్ వ్యాఖ్యల పట్ల చైనా తీవ్ర అభ్యంతరం తెలిపింది. మొత్తానికి కరోనా వేరియంట్లకు దేశాల పేరు పెట్టడం పలు దేశాల మధ్య వివాదాన్ని రాజేస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ…వివిధ వేరియెంట్లకు పేరు పెట్టింది. ఇప్పటి నుంచి ఆ పేర్లతోనే పిలవాలనే నిబంధన విధించింది.
ప్రస్తుతం కరోనా వేరియంట్లలో రెండు రకాలు 1.వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (VOCs) 2.వేరియంట్స్ ఆఫ్ ఇంట్రస్ట్ (VOIs)
ఒకటో రకం వేరియంట్లు ఇతర దేశాలకూ వ్యాపించిన రకం. రెండోరకం వేరియంట్లు ఏ దేశంలో పుడితే ఆ దేశానికే పరిమితమైనవి. వేరియంట్లకు పేర్లు పెట్టేటప్పుడు కూడా ఈ విభజనను ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే ఉంచింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన రెండు కొత్త వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2 కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్లు పెట్టింది. వీటిలో బి.1.617.2 వేరియంట్‌కు ‘డెల్టా’(Delta) అని నామకరణం చేసింది. ఇండియాలో ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ డెల్టా(Delta). 2020 అక్టోబర్ లో ఇండియాలో ఈ వేరియంట్‌ను కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అలాగే బి.1.617.1 వేరియంట్‌కు ‘కప్పా’(Kappa) అని నామకరణం చేసింది. ఈ బి.1.617 కరోనా వేరియంట్ ఇప్పటి వరకూ 53 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వీటిని కొవిడ్-19 వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (వీవోసీ)లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అలాగే పలు వివిధ దేశాల్లో ముందుగా గుర్తించిన వేరియంట్లకు గ్రీక్ సింబల్స్‌తో నామకరణం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
ఇవి కూడా చదవండి..
జూన్ 10న ఆకాశంలో మరో అద్భుతం.. ఈసారి సంభవించే సూర్యగ్రహణం ప్రత్యేకత ఏమిటంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో వైట్ ఫంగస్ కలకలం.. కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో వ్యాధి నిర్ధారణ