ఏపీలో కరోనా కల్లోలం..విజయవాడలో దంపతుల మృతి !
ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. గంటగంటలకు కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక మూలన కోవిడ్-19 కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని పాతబస్తీకి చెందిన భార్యభర్తలు

ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. గంటగంటలకు కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక మూలన కోవిడ్-19 కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుండటంతో పాటు అనుమానితుల సంఖ్య కూడా సోమవారం ఒక్కరోజులోనే అమాంతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని పాతబస్తీకి చెందిన భార్యభర్తలు ఒక్కరోజు వ్యవధిలోనే మరణించారు. వీరు ఇటీవల ఢిల్లీలోని ఓ మత ప్రార్థనల కోసం వెళ్లివచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో మరింత ఆందోళన మొదలైంది.
విజయవాడ పాతబస్తీలో నివసిస్తున్న ఓ దంపతులు కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ మత పరమైన కార్యక్రమానికి వెళ్లొచ్చారు. ఆ తర్వాత దంపతులిద్దరూ ఒకే లక్షణాలతో 24గంటల వ్యవధిలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం సాయంత్రం భార్య న్యుమోనియాతో మరణించింది. సోమవారం ఉదయం ఆమె భర్త కూడా అవే లక్షణాలతో కొత్త ప్రభుత్వాసుపత్రిలో చనిపోయాడు. దగ్గు, ఆయాసం లక్షణాలతో వీరిద్దరు మృతిచెందడంతో కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని పరీక్షించిన డాక్టర్లు ధ్రువీకరించడంలేదు.
కాగా, వారి ఇద్దరు కుమార్తెలతో పాటు ఇతర బంధువులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే, దంపతుల మృతిపై నివేదికలు వస్తేనే గానీ తాము అధికారంగా చెప్పలేమని డీఎంహెచ్‌వో అధికారులు చెబుతున్నారు. కాగా, విజయవాడలోని అదే ప్రాంతానికి చెందిన మరో 26 మంది కూడా ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమానికి వెళ్లిన్నట్లుగా గుర్తించిన అధికారులు..వారందరినీ క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.