దేశంలో కరోనా కలవరం.. స్కూళ్ళు, కాలేజీలు మూసివేత

దేశంలో కరోనా నివారణకు కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల గురించి తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.

దేశంలో కరోనా కలవరం.. స్కూళ్ళు, కాలేజీలు మూసివేత
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 14, 2020 | 5:48 PM

దేశంలో కరోనా నివారణకు కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల గురించి తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. ఇప్పటివరకు ఇండియాలో 83 మందికి కరోనా వ్యాధి లక్షణాలు కనిపించాయని తెలిపింది. వీరిలో 66 మంది భారతీయులు, 17 మంది విదేశీయులు ఉన్నట్టు వెల్లడించింది. కర్నాటకలో ఒకరు, ఢిల్లీలో మరొకరు కరోనా వ్యాధిగ్రస్థులు మృతి చెందారు. ఈ వెబ్ సైట్ ప్రచురించిన వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీ

ఢిల్లీలో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరిని డిశ్చార్జి చేశారు. ఈ నెల 13  న 68 ఏళ్ళ మహిళ కరోనాతో చనిపోయింది. నగరంలోని అన్ని స్కూళ్ళు, కాలేజీలు, సినిమా హాళ్లు, యూనివర్సిటీలను ఈ నెలాఖరువరకు మూసివేశారు. అలాగే ఐఐటీలో అకడమిక్, కరిక్యులర్, కో-కరిక్యులర్ కార్యకలాపాలను నిలిపివేశారు. జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా యూనివర్సిటీలలో తరగతుల నిర్వహణను రద్దు చేశారు.

హర్యానా

హర్యానాలో 14  కరోనా కేసులు నమోదు కాగా.. వీరంతా విదేశీయులే. బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమికూడరాదని ప్రభుత్వం ఆదేశించింది. సోనే పట్ లోని జిందాల్ యూనివర్సిటీని ఈ నెల 29 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు.

కేరళ

కేరళలో 22  కేసులు నమోదు కాగా.. వ్యాధిలక్షణాలు సోకినవారిలో ముగ్గురు కోలుకున్నారు. బర్ద్ ఫ్లూ భయంతో పరప్పనగడి ప్రాంతంలో కోళ్లను సామూహికంగా చంపివేయాలని అధికారులు ఆదేశించారు.

కర్ణాటక

కర్ణాటకలో ఆరు కేసులు నమోదయ్యాయి. సౌదీ నుంచి వఛ్చిన 76 ఏళ్ళ ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు. అయితే ఆయనకు ఇతర శారీరక రుగ్మతలు కూడా ఉన్నాయని వెల్లడైంది. రాష్ట్రంలో స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ మాల్స్, స్కూళ్ళు, కాలేజీలను, సినిమా థియేటర్లను వారం రోజులపాటు మూసివేయాలని సీఎం ఎదియురప్ప ప్రభుత్వం ఆదేశించింది.

మహారాష్ట్ర

మహారాష్ట్రలో 14 కేసులు నమోదయ్యాయి. నాగపూర్ లో నలుగురు కరోనా అనుమానితులు ఒక ఆసుపత్రి నుంచి పరారయ్యారు. అయితే వారు మళ్ళీ ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రంలో ఈ నెల 30 వరకు విద్యాసంస్థలు, సినిమాహాళ్లు మూసివేయాలని ఉధ్ధవ్ థాక్రే సర్కార్ ఆదేశించింది.

తమిళనాడు

తమిళనాడులో చిన్న పిల్లల స్కూళ్లను ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాగా-యూపీలో 11 కేసులు, రాజస్థాన్ లో మూడు, జమ్మూ కాశ్మీర్లో రెండు, పశ్చిమ బెంగాల్ లో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇక పంజాబ్,  తెలంగాణా, ఏపీ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.