Covid Effect: కరోనా తగ్గినా కొత్త సమస్యలు.. ప్రధాన అవయవాలపై ప్రభావం.. కాలిఫోర్నియా శాస్త్రవేత్తల వెల్లడి!
కరోనా మహమ్మారి మిగులుస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కోవిడ్ నుంచి కోలుకున్న కొంతమందిలో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటున్నాయి. వారు మళ్లీ ఇప్పుడు ఆసుపత్రుల బాట పడుతున్నారు
Coronavirus on Energy of Cells in Organs: కరోనా మహమ్మారి మిగులుస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కోవిడ్ నుంచి కోలుకున్న కొంతమందిలో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటున్నాయి. వారు మళ్లీ ఇప్పుడు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఈ తరహా బాధితులు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తీవ్రస్థాయి కోవిడ్-19 బాధితుల్లో కొందరికి అవయవాలు విఫలం కావడానికి కారణాలను కనుగొన్నట్లు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. కణాలు శక్తిని తయారుచేసుకునే ప్రక్రియను కరోనా వైరస్ నిలువరిస్తోందని, అవయవాల వైఫల్యానికి ఇదే కారణమవుతోందని తేల్చారు. మనుషుల శరీరాల్లో ప్రతి కణానికీ శక్తి అవసరం. అప్పుడే అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. కోవిడ్-19 కారక సార్స్-కోవ్-2 వైరస్ ఇక్కడే దెబ్బకొడుతోంది. గుండె, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాల్లోని కణాలు శక్తిని తయారుచేసుకునే ప్రక్రియను ఇది నిలువరిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో అవయవాలు చతికిలపడిపోతున్నాయని చెప్పారు.
ఇటీవల ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని సైంటిస్టులు తెలిపారు. శాస్త్రవేత్తలు తొలుత కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యేలా ఎలుకల్లో మార్పులు చేశారు. ఈ జీవుల్లోని ఏసీఈ-2 గ్రాహకాన్ని కరోనా గుర్తించలేదు. అందువల్ల వైరస్ ప్రభావానికి గురిచేసినా వాటికి ఇన్‌ఫెక్షన్ సోకదు. అందుకే కరోనా సోకేలా ఈ ఎలుకల్లో జన్యుమార్పులు చేసి, పరిశోధన సాగించారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఎలుకలన్నీ ఏడు రోజుల్లోనే తిండి మానేశాయి. సగటున 20% మేర బరువు తగ్గాయి. ఇవన్నీ కణాల్లో శక్తి ప్రక్రియ నిలిచిపోయిందనటానికి సూచికలే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా బాధితుల్లో అవయవాల వైఫల్యాన్ని నివారించే కొత్త చికిత్సలకు ఈ ఆవిష్కారం వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికలు అందాల్సి ఉంది.
Read Also.. CM KCR : కృష్ణా జలాల వివాదంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణ వాటా కోసం రాజీలేకుండా పోరాడుతామని ప్రకటన