Covid Children: పిల్లలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వద్దు, తప్పదనుకుంటేనే సీటీ స్కాన్, స్టెరాయిడ్స్.. కరోనా చికిత్సపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్
మూడో దశలో పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన రెట్టింపు అవుతోంది. చిన్న పిల్లలకు కరోనా చికిత్సపై కేంద్రం కీలక మార్గదర్శకాలు
Covid 19 Management In Children: కరోనా వైరస్ థర్డ్ వేవ్.. ఇప్పుడు ప్రపంచానికి గుబులు పుట్టిస్తోంది. తొలి రెండు దశల్లో వృద్ధులు, యువతపై కరోనా పంజా విసరటంతో కాస్త తట్టుకోగలిగాం. కానీ, మూడో దశలో పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన రెట్టింపు అవుతోంది. అయితే, మన దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ తలెత్తబోదని, చిన్నపిల్లలకు పెద్దగా ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ, చిన్న పిల్లలకు కరోనా చికిత్సపై కీలక మార్గదర్శకాలను జారీచేసింది..
చిన్నారులు కోవిడ్ ప్రభావితమయితే దానికి సంబంధించిన చికిత్స, నిర్వహణ పద్దతులను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. చిన్నపిల్లల్లో కరోనా తీవ్రత, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) బుధవారం ఈ మేరకు తాజాగా జారీ చేసింది.
కరోనా సోకిన చిన్న పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది. పిల్లలకు కచ్చితంగా అవసరమైతేనే, అది కూడా వైద్యుల పర్యవేక్షణలో హై-రెజల్యూషన్ సీటీ స్కాన్‌ను తీయించాలని సూచించింది. స్టెరాయిడ్లను కూడా దాదాపు వాడవద్దన్న ఆరోగ్యశాఖ, అత్యంత క్రిటికల్ అనుకున్న కేసుల్లో మాత్రమే స్టెరాయిడ్లను ఆప్షన్ గా భావించాలన్నారు. లక్షణాలులేని, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారికి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని, వీటివల్ల హానికరమని కేంద్రం పేర్కొంది.
కరోనా సోకిన తర్వాత, తక్కువ, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారిలో జ్వరం తగ్గేందుకు ప్రతి 4-6 గంటలకు ఒకసారి పారాసిటమాల్ 10-15ఎంజీ/కేజీ/డోసు ఇవ్వొచ్చని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది. పిల్లలకు కరోనా టెస్టులకు సంబంధించి.. గదిలో పిల్లలు ఆరు నిమిషాల పాటు నడిచాక, పల్స్ ఆక్సీమీటర్ సాయంతో వారి ఆక్సిజన్ స్థాయులు తెలుసుకోవాలని, ఆక్సిజన్ సమస్య తలెత్తితే వైద్యుల్ని సంప్రదించాలని పేర్కొంది. ఇక, తీవ్రమైన కోవిడ్ అనారోగ్యం ఉన్న సందర్భాల్లో.. ఆక్సిజన్ చికిత్సను వెంటనే ప్రారంభించాలి. ద్రవ పదార్ధాలను ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కొనసాగించాలి. కార్టికోస్టెరాయిడ్స్ చికిత్సను ప్రారంభించాలని కేంద్ర సూచించింది. “స్టెరాయిడ్లను సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన వ్యవధిలో వాడాలి” అని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.