AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: స్వదేశీల టీకాల సామర్థ్యంపై సందేహాలు.. వైరస్‌ సోకే ప్రమాదం ఉందా.. ఢిల్లీ ఎయిమ్స్‌ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తాయన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Covid Vaccine: స్వదేశీల టీకాల సామర్థ్యంపై సందేహాలు.. వైరస్‌ సోకే ప్రమాదం ఉందా.. ఢిల్లీ ఎయిమ్స్‌ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!
Covaxin Provides Protection Against Beta, Delta Variants
Balaraju Goud
|

Updated on: Jun 10, 2021 | 8:12 AM

Share

Covid-19 Vaccine provides protection: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి చూపిస్తున్న ప్రభావం అంతా ఇంత కాదు.. కొత్త కొత్త వేరియంట్లతో రూపాంతరం చెందుతూ కంగారు పుట్టిస్తోంది. అయితే, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తాయన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో సెకండ్‌వేవ్‌కి కారణంగా భావిస్తున్న డెల్టా వేరియంట్‌ (బీ.1.617.2)ను అడ్డుకోవడంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు అంతగా పనిచేయడం లేదని ఎయిమ్స్‌ అధ్యయనం పేర్కొనగా.. డెల్టా, బీటా వేరియంట్లపై కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్టు ఐసీఎంఆర్‌ మరో అధ్యయనంలో వెల్లడించింది. పూర్తి విరుద్ధంగా ఉన్న ఈ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థల అధ్యయన ఫలితాలు వ్యాక్సిన్ల పనితీరుపై కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

స్వదేశీయంగా తయారైన సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘కొవిషీల్డ్‌’, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాలను వేసుకున్నప్పటికీ.. డెల్టా వేరియంట్‌ సోకే ప్రమాదముందని ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఇటీవల జరిపిన ఓ అధ్యయనం ద్వారా వెల్లడించింది. ఈ టీకాల రెండు డోసులు వేసుకున్న వారిలోనూ వైరస్‌ సోకే ప్రమాదం లేకపోలేదని తెలిపింది. ఈ మేరకు ఎయిమ్స్‌-ఐజీఐబీ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ) కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 63 మంది రోగులను పరీక్షించింది.

అధ్యయనంలో భాగంగా 36 మందికి రెండు టీకా డోసులు అందించి పరిశోధనలు జరిపారు. కొందరికి కొవాగ్జిన్‌ రెండు డోసులు, మరికొందరికి కొవిషీల్డ్‌ రెండు డోసులు వేశారు. మిగిలిన వారు ఒక టీకా డోసు తీసుకున్నారు. సింగిల్‌ డోసు టీకా తీసుకున్న వారిలో 76.9 శాతం మందికి డెల్టా వేరియంట్‌ సోకగా, రెండు డోసుల టీకా తీసుకున్నవారిలో 60 శాతం మందికి ఈ వేరియంట్‌ సోకింది.

మరోవైపు, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్సీడీసీ) చేసిన మరో అధ్యయనంలో కూడా దాదాపుగా ఇవే ఫలితాలు వెలువడ్డాయి. కొవిషీల్డ్‌ టీకా వేసుకున్న 27 మంది రోగుల్లో 70.3 శాతం మందికి డెల్టా వేరియంట్‌ సోకినట్టు ఎన్సీడీసీ అధ్యయనం వివరించింది. ఈ రెండు టీకాలను వేసుకున్నప్పటికీ, డెల్టాతో పాటు ఆల్ఫా వేరియంట్‌ కూడా సోకే ప్రమాదం లేకపోలేదని ఎయిమ్స్‌, ఎన్సీడీసీ అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, ఈ నివేదికలపై నిపుణుల సమీక్ష ఇంకా జరుగలేదు.

ఇదిలావుంటే, డెల్టా, బీటా వేరియంట్ల నుంచి కొవాగ్జిన్‌ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ), భారత్‌ బయోటెక్‌ చేపట్టిన సంయుక్త అధ్యయనం వెల్లడించింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న 20 మందిలో 17 మందికి కొవాగ్జిన్‌ రెండు డోసులు ఇచ్చారు. టీకా వేసుకున్నవారి నుంచి రక్తనమూనాలను సేకరించగా.. కొవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్న వారిలో 28 రోజుల అనంతరం.. డెల్టా, బీటా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం పెరిగినట్టు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాల్ని కూడా నిపుణులు సమీక్షించాల్సి ఉన్నది. కొవాగ్జిన్‌పై నాలుగో దశ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్టు భారత్‌ బయోటెక్‌ తెలిపింది. టీకా అత్యవసర వినియోగానికి కావాల్సిన అన్ని శాస్త్రీయ ప్రమాణాలు, నాణ్యతను పరీక్షించడానికి ఈ ప్రయోగాలు చేస్తోంది.

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసుల మధ్య ప్రస్తుతం ఉన్న 12-16 వారాల వ్యవధిని మళ్లీ 8 వారాలకు తగ్గించాలని బ్రిటన్‌కు చెందిన అధ్యయనం ఒకటి అభిప్రాయపడింది. భారత్‌లో సెకండ్‌వేవ్‌కు కారణంగా భావిస్తున్న డెల్టా వేరియంట్‌ను (బీ.1.617.2) ఎదుర్కొనే యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు) రెండో డోసు వేసుకున్న తర్వాతనే అభివృద్ధి చెందుతున్నట్టు వెల్లడించింది. ‘ఒక్క డోసు రక్షణతో డెల్టా వేరియంట్‌ వ్యాప్తిని కట్టడి చేయలేం’ అని ఎన్సీడీసీ-ఐజీఐబీ పరిశోధకులు చెప్పినట్టు వెల్లడించింది. కొవిషీల్డ్‌ మొదటి డోసు వేసుకున్న వారిలో డెల్టా వేరియంట్‌ నుంచి 33 శాతం మాత్రమే రక్షణ లభించగా, రెండు డోసులు వేసుకున్న మూడు వారాల అనంతరం 60 శాతం వరకు రక్షణ లభించినట్టు అధ్యయనం పేర్కొంది. ‘దేశంలో డెల్టా వేరియంట్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న క్రమంలో డోసుల మధ్య వ్యవధిని తగ్గించడం మంచిది’ అని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కే శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు. కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధిని కేంద్రం గత నెలలో 12-16 వారాలకు పెంచింది కేంద్రప్రభుత్వం.

Read Also….  Covid Children: పిల్లలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వద్దు, తప్పదనుకుంటేనే సీటీ స్కాన్, స్టెరాయిడ్స్.. కరోనా చికిత్సపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్