కరోనా కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం.. ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ పరీక్ష చేయించుకోండి..
Covid New Guidelines: కరోనా చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ సోకిన వారికి స్టెరాయిడ్స్ ఇవ్వకుండా
Covid New Guidelines: కరోనా చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ సోకిన వారికి స్టెరాయిడ్స్ ఇవ్వకుండా ఉండాలని వైద్యులకు సూచించింది. కొత్త మార్గదర్శకాలలో కరోనా తేలికపాటి, తీవ్రమైన లక్షణాల కోసం వివిధ ఔషధాలను సూచించారు. అంతేకాకుండా ఎవరైనా నిరంతర దగ్గుతో బాధపడుతుంటే రెండు-మూడు వారాలైనా తగ్గకుంటే వెంటనే క్షయవ్యాధి (టిబి) పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
ఈ మార్గదర్శకాల ప్రకారం.. స్టెరాయిడ్లను కలిగి ఉన్న మందులు, అధిక మోతాదులో ఉపయోగించినట్లయితే, మ్యూకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ వంటి సెకండరీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఎక్కువ కాలం స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఇలా జరగుతుంది. కొద్ది రోజుల క్రితం కొవిడ్ టాస్క్ ఫోర్స్ అధిపతి వికె పౌల్, సెకండ్ వేవ్‌లో స్టెరాయిడ్స్ అధికంగా వినియోగించడం పై విచారం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మార్గదర్శకాల ప్రకారం.. కోవిడ్ లక్షణాలు ఎగువ శ్వాసకోశంలో ఏర్పడితే రోగికి శ్వాస తీసుకోవడం లేదా హైపోక్సియా వంటి సమస్యలు లేకుంటే అది తేలికపాటి లక్షణాలుగా గుర్తిస్తారు. దీనికి ఇంట్లోనే ఒంటరిగా చికిత్స చేయాలని తెలిపారు. అదే సమయంలో రోగిలో ఆక్సిజన్ 90 నుంచి 93 శాతం మధ్య హెచ్చుతగ్గులకు గురవుతుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక జ్వరం ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. వెంటనే ఆక్సిజన్ అందించాలని తెలిపారు.
తీవ్రంగా కరోనా లక్షణాలు ఉన్న వారికి రెమెడెసివిర్ డ్రగ్ ఇవ్వొచ్చు. మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేని వారికి ఈ ఔషధాన్ని ఇవ్వకూడదు. తీవ్ర వ్యాధి లక్షణాలు ఉన్నవారికి 48 గంటలలోపు టోసిలిజుమాబ్ డ్రగ్‌ను ఇవ్వవచ్చు. ఆక్సిజన్ లెవల్ 90 కన్నా తక్కువగా ఉంటే సీరియస్ గా పరిగణించి.. వెంటనే ఐసీయూ సదుపాయం ఉండే గదికి మార్చాలని కొత్త గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు.