Coronavirus: మహారాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. ఒక్క రోజులో 36,000 కొత్త కేసులు.. ప్రజలకు కీలక ఆదేశాలు జారీ..
Coronavirus: మహారాష్ట్రలో కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా గురువారం ఒక్క రోజే 35,952 కొత్త కరోనా...
Coronavirus: మహారాష్ట్రలో కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా గురువారం ఒక్క రోజే 35,952 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 111 మరణాలు సంభవించాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా 5,504 కొత్త కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. వరుసగా రెండవ రోజూ 5,000 కేసులు దాటి గరిష్ట కేసులను నమోదు చేసింది. దీనికి ముందు రోజు(బుధవారం నాడు) మహారాష్ట్రంలో 31,855 కొత్త కేసులు నమోదవగా.. ముంబైలో 5,185 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. మొంబైల్‌లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతోందని వైద్యులు గుర్తించారు. ఇదే సమయంలో కరోనా తీవ్రత చాలా తక్కువగానే ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం, అధికారులు అలర్ట్ అయ్యారు. పలు పట్టణాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు.
కాగా, ఫిబ్రవరి నెల చివరి నుండి దేశంలోని అనేక రాష్ట్రాల్లో కేసులు పెరిగాయి. ప్రజల్లో కరోనా భయం పూర్తిగా తొలగిపోవడం, ఫేస్ మాస్క్ ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం వంటి కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలు ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరడగానికి ప్రధాన కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ బలోపేతం అవుతుందనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభన సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తోంది. గతేడాది కరోనా కారణంగా ముంబై నుంచి తమ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయిన వలస కార్మికులు.. కరోనా ఉధృతి తగ్గడంతో తిరిగి మొంబైకి వచ్చారు. వివిధ కార్యాలయాలు, కర్మాగారాల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కరోనా వ్యాప్తి చెందుతుండటంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇదిలాఉంటే.. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలైన నాందేడ్, బీడ్ ప్రాంతాల్లో పది రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించింది. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే బదులుగా స్థానిక అధికారుల.. ఆయా ప్రాంతాల్లో నమోదవుతున్న కరోనా కేసులను బట్టి లాక్‌డౌన్ విధించే అధికారాన్ని అప్పగించింది ప్రభుత్వం. ఇక మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ను ‘‘డబుల్ మ్యూటెంట్’’ అని పేరు పెట్టారు. ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక హోలీ పండుగ నేపథ్యంలో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నాగ్‌పూర్‌లో పూర్తిగా ఆంక్షలు ఎత్తివేసింది. దాంతో నాగ్ పూర్ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చారు. షాపింగ్ మాల్స్, షోరూమ్స్ జనాలతో కిటకిటలాడుతున్నాయని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇలా అందరూ బయటకు రావడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉందని, అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. పూర్తి లాక్‌డౌన్ విధించే పరిస్థితి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.
Also read: