కేరళలో కరోనా విజృంభణ..వైరస్ వ్యాప్తిపై సీఎం కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ రెట్టింపు స్థాయిలో నమోదవుతోంది. వైరస్ ఉధృతంగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికీ లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో మమమ్మారి వ్యాప్తి గురించిన ఓ విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ రెట్టింపు స్థాయిలో నమోదవుతోంది. వైరస్ ఉధృతంగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికీ లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో మమమ్మారి వ్యాప్తి గురించిన ఓ విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా సమూహ వ్యాప్తి మొదలవ్వలేదని కేంద్రం చెబుతుండగా, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్ర రాజధాని తీరప్రాంతాల్లో కరోనా మహమ్మారి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ మొదలైందని చెప్పారు.
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని తీర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని సీఎం పినరాయి విజయన్ తెలిపారు. పుంథురా, పులివిల్లా ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాజధానిలో శుక్రవారం 246 కేసులు నమోదు కాగా.. వాటిలో బయటి నుంచి వచ్చిన కేసులు రెండు మాత్రమే. ఈ నేపథ్యంలో మరో లాక్ డౌన్ ఉంటుందని కూడా సీఎం తెలిపారు. మొత్తం తీర ప్రాంతాన్ని మూడు జోన్లగా విభజించి పూర్తి లాక్ డౌన్ విధిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సీఎం స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, ఇదే అంశానికి సంబంధించి కేరళ హెల్త్ మినిస్టర్ కేకే శైలజ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కరోనా క్లస్టర్స్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ రేటు 50 శాతానికి పైగా ఉందని ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ కేకే శైలజ తెలిపారు. క్లస్టర్ ఫార్మింగ్‌ను, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను నియంత్రించాల్సిన అత్యవసరం తమపై ఉందన్నారు. సమూహ వ్యాప్తి అవుతున్న చైన్‌ను ఆపడానికి యత్నిస్తున్నామని చెప్పారు. అందుకోసం కోసం క్లస్టర్స్‌ను లాక్ చేస్తున్నామని పేర్కొన్నారు. కేరళలో 11 వేల కరోనా కేసులు నమోదవగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలకు పైగా ఉంది.