Covid Third Wave: దడ పుట్టిస్తున్నకొవిడ్ థర్డ్ వేవ్ ‘గండం’… పసిమొగ్గలను కాపాడుకోవడం ఎలా?
Covid Third Wave Update: ఫస్ట్ వేవ్ ప్రభావం చిన్నారులపై పెద్దగా లేదు. సెకండ్ వేవ్‌లో చిన్నారులు ఎక్కువ సంఖ్యలోనే ఆస్పత్రిపాలయ్యారు. ఇక థర్డ్ వేవ్‌లో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్నది అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా.
Covid Third Wave: సెకండ్ వేవ్ కోవిడ్ కేసులు తగ్గడం కాస్త ఊరటనిస్తున్నా…థర్డ్ వేవ్ ముప్పుపై అంచనాలు దడ పుట్టిస్తోంది. థర్డ్ వేవ్‌లో ఎక్కువగా చిన్నారులు బాధితులు కావచ్చన్న వైద్య నిపుణుల అంచనాలు అందరినీ భయపెడుతోంది. ఫస్ట్ వేవ్ ప్రభావం చిన్నారులపై పెద్దగా లేదు. సెకండ్ వేవ్‌లో చిన్నారులు ఎక్కువ సంఖ్యలోనే ఆస్పత్రిపాలయ్యారు. ఇక థర్డ్ వేవ్‌లో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్నది అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు వైద్య నిపుణులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశాయి. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, చిన్నారులను థర్డ్ వేవ్ గండం నుంచి కాపాడుకోవడంపై ముందస్తు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టాయి. ఆ మేరకు చిన్నారుల కోసం అదనపు బెడ్స్‌ను సమకూర్చుకోవడం, మెడిసిన్స్‌ను సమకూర్చుకోవడంపై దృష్టిసారించాయి.
ఇటు తెలంగాణ సర్కారు సైతం థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టిసారించింది. చిన్నారులకు మెరుగైన వైద్య చికిత్సను అందించేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా చిన్నారులకు చికిత్స కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అదనపు బెడ్స్‌ను సమకూర్చుకోవడం, మెడిసిన్స్ కొరత లేకుండా చూడడం, పిల్లల వైద్య సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపడుతోంది. అవసరమైన చోట కొత్త నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల బదిలీల ద్వారా సర్దుబాటు చేస్తున్నారు. ఐసీయూలో పిల్లలకు చికిత్స కల్పించడంపై నర్సులకు ప్రత్యేక శిక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది.
కాగా శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టడం ద్వారా థర్డ్ వేవ్‌కు అడ్డుకట్టవేయగలమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ తప్ప మరో పరిష్కార లేదంటున్నారు. ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ చేసిన దేశాలు మాత్రమే కరోనాను కట్టడి చేయగలిగాయని గుర్తుచేశారు. మన దేశంలోనూ చిన్నారులకు కూడా వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేమంటున్న వైద్య నిపుణులు…అయితే ఇది చిన్నారులపై మాత్రమే ప్రభావాన్ని చూపుతుందని భావించలేమన్నారు. అన్ని వయస్కులపైనా థర్డ్ వేవ్ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండొచ్చని కొందరు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది? దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? అన్న అంశాలను ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.
ఏ మాత్రం కరోనా మహమ్మారి పట్ల అజాగ్రత్తవహించకుండా…మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్త చర్యలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సూచిస్తున్నారు. అదే సమయంలో చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్.. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే..!
కోవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్సకు ఖర్చులు పెరిగిపోతున్నాయా…! రుణం ఇస్తామంటున్న బ్యాంకులు..