కరోనా కంటే డేంజర్…! నగరంలో నకిలీ శానిటైజర్

అసలు శానిటైజర్ల స్థానంలో కొంత మంది నకిలీ శానిటైజర్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు, తెలంగాణ ఆయుష్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో జరిపిన సోదాల్లో....

కరోనా కంటే డేంజర్...! నగరంలో నకిలీ శానిటైజర్
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 19, 2020 | 1:29 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా మాస్క్‌లు, శానిటైజర్లకు విపరీతంగా డిమాండ్‌ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కొందరు కేటుగాళ్లు అక్రమదందాకు తెరలేపారు. అసలు శానిటైజర్ల స్థానంలో కొంత మంది నకిలీ శానిటైజర్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు, తెలంగాణ ఆయుష్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో జరిపిన సోదాల్లో డూప్లికేట్ హ్యాండ్ శానిటైజర్ తయారీ ముఠాగుట్టు రట్టు చేశారు. లక్షల విలువ చేసే నకిలీ శానిటైజర్, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే…

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి ప్రాంతంలో అనుమతి లేకుండా రసాయనాలు తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో నకిలీ శానిటైజర్ల తయారీ కోసం సిద్ధం చేసిన రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని, అట్టపెట్టెలో నింపి పంపిణీకి సిద్ధంగా ఉన్ననకిలీ శానిటైజర్లను స్వాధీనం చేసుకున్నారు. 100మి.లీ శానిటైజర్ల 25 వేల యూనిట్లు, ఫేస్ మాస్క్‌లు, రూ. 40 లక్షల విలువైన ముడి పదార్థాలను సీజ్ చేశారు. నకిలీ ఉత్పత్తుల తయారీలో పాల్గొన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు నిందితులు దాదాపుగా కోటిన్నర విలువ చేసే లక్ష వరకు నకిలీ శానిటైజర్ బాటిళ్లను తయారు చేసి విక్రయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇదిలా ఉంటే, మరోవైపు రాచకొండలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, రూ. 10 లక్షల విలువైన 2,500 నకిలీ శానిటైజర్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులు 2018లో ఆయుష్ సాఫ్ట్‌గెల్ క్యాపూల్స్‌&సిరప్స్ పేరుతో లైసెన్స్ తీసుకుని, హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో ఓ కర్మాగారాన్ని స్థాపించారు. ఆయుష్ సాఫ్ట్‌గెల్ క్యాపూల్స్‌, సిరప్‌లను తయారు చేయడం ప్రారంభించినట్లుగా అధికారులు గుర్తించారు. ఇలాంటి నకిలీ శానిటైజర్లు మార్కెట్‌లో కొంటే మోసపోక తప్పదని హెచ్చరిస్తున్నారు. నకిలీ ఉత్పత్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.