Corona Antibodies: కొవిడ్ విజేతల్లో 8 నెలల పాటు యాంటీబాడీలు.. తాజా పరిశోధనలో వెల్లడి
కొవిడ్ బారినపడిన తరువాత ఎనిమిది నెలల వరకు శరీరంలో యాంటీ బాడీలు ఉంటున్నాయి. ఈ విషయం ఇటలీలో జరిపిన పరిశోధనల్లో వెల్లడయింది.
కొవిడ్ బారినపడిన తరువాత ఎనిమిది నెలల వరకు శరీరంలో యాంటీ బాడీలు ఉంటున్నాయి. ఈ విషయం ఇటలీలో జరిపిన పరిశోధనల్లో వెల్లడయింది. కొవిడ్ బారిన పడిన వారిలో ఎన్ని రోజుల వరకు ఉంటాయనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై ఇటలీలోని ఐఎస్‌ఎస్ నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సైంటిస్టులు అధ్యయనం జరిపారు. ఇందులో భాగంగా కరోనా సోకి మిలాన్‌లోని ఒక ఆసుపత్రిలో చేరిన 162 మందిని పరిశీలించారు. రోగుల వయస్సు, ఇతర వ్యాధులతో సంబంధం లేకుండా యాంటీబాడీలు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల శరీరంలో ఎనిమిది నెలలు ఉంటాయని మిలన్లోని శాన్ రాఫెల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన మార్చి, ఏప్రిల్ నెలల్లో వీరి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. నవంబరు చివర్లో మరోసారి వాటిని తీసుకున్నారు. యాంటీబాడీల ఉనికి వీరిలో క్రమేణా తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే వైరస్ సోకిన 8 నెలల తర్వాత కూడా వాటి ఉనికి ఉన్నట్లు నిర్ధారించారు. అన్ని నెలల తర్వాత ముగ్గురిలో మాత్రమే ఇవి లేవని పరిశోధన వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు. కరోనా సోకిన 15 రోజుల్లో యాంటీబాడీలు ఉత్పత్తి కాకుంటే వారిలో వ్యాధి తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పారు.