AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: కోవిడ్ బారినపడ్డ పిల్లల్లో కొత్త సమస్యలు.. వైద్య నిపుణుల అధ్యయనంలో వెలుగులోకి షాకింగ్ విషయాలు !

కోవిడ్‌-19 పిల్లలను పెద్దగా ఇబ్బందేమీ పెట్టటం లేదు. కానీ కొందరిలో గుండె, రక్తనాళాలు, కళ్లు, చర్మం వంటి అవయవాలను ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

Covid 19: కోవిడ్ బారినపడ్డ పిల్లల్లో కొత్త సమస్యలు.. వైద్య నిపుణుల అధ్యయనంలో వెలుగులోకి షాకింగ్ విషయాలు !
Children
Balaraju Goud
|

Updated on: Aug 10, 2021 | 6:47 PM

Share

Hepatitis in Children: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంత కాదు.. కోవిడ్ బారిన పడిన పెద్దవారు దీర్ఘకాలంగా దాని వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతూ ఉంటారు. కొన్ని నెలల వరకు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అలసటతో పాటు మరికొన్ని లక్షణాలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే పిల్లల్లో ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ అని వైద్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చాలా అధ్యయనాలు నిరూపించాయి. తాజాగా ఓ కొత్త పరిశోధన కూడా ఇది నిజమని నిరూపిస్తోంది.

అయితే, కోవిడ్‌-19 పిల్లలను పెద్దగా ఇబ్బందేమీ పెట్టటం లేదు. కానీ కొందరిలో గుండె, రక్తనాళాలు, కళ్లు, చర్మం వంటి అవయవాలను ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ (మిస్సీ) అంటారని వైద్యు చెబుతున్నారు. అయితే, కోవిడ్‌-19 అనర్థాలు దీంతోనే ఆగటం లేదు. ఇది పిల్లల్లో కాలేయవాపు (హెపటైటిస్‌) సైతం తెచ్చిపెడుతున్నట్టు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) అధ్యయనం పేర్కొంటోంది.

రెండోసారి కోవిడ్‌-19 విజృంభించిన సమయంలో ఉన్నట్టుండి కాలేయవాపు లక్షణాలు బయటపడిన పిల్లలను పరిశీలించగా ఈ విషయం బయటపడిందని వెల్లడించింది. మూడు నుంచి ఆరు వారాల క్రితం కరోనా వైరస్ బారినపడ్డ కొందరు పిల్లల్లో కుటుంబంలో ఎవరికీ కాలేయ జబ్బులు లేకపోయినా హెపటైటిస్‌ లక్షణాలు కనిపించాయని తమ నివేదికలో వివరించారు. వీరిలో చాలామందిలో కోవిడ్‌ లక్షణాలేవీ లేకపోవటం గమనార్హం. కొందరు పిల్లలో మిస్సీ తరహా లక్షణాలు వెలుగుచూశాయి. ఇదిలావుంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెల్టా వంటి కొత్త కరోనా వైరస్‌ రకాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో పిల్లల్లో కాలేయవాపు లక్షణాలపై ఓ కన్నేసి ఉంచటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

మరో అధ్యయనంలో కరోనా వచ్చిన తర్వాత పిల్లల్లో దాదాపు ఆరు రోజులలోపే పూర్తిగా రికవరీ కనిపిస్తుంది. నాలుగు వారాల తర్వాత కూడా లక్షణాలు కనిపించే పిల్లలు చాలా అరుదు. బాధితుల్లో వీరు కేవలం 4.4 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ విషయాన్నే యూకేకి చెందిన ఓ స్టడీ మరోసారి నిరూపించింది. ఈ అధ్యయనాన్ని లాన్సెట్ చైల్డ్ అండ్ అడోలసెంట్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు.

లండన్‌లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ ఎమ్మా డంకన్ దీనికి లీడ్ ఆథర్‌గా వ్యవహరించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. చిన్న పిల్లల్లో కరోనా లక్షణాలు దీర్ఘకాలం ఉండవు అని నిరూపించేందుకు ఇది మరో అధ్యయనం అని వెల్లడించారు. అయితే, చాలా తక్కువ శాతం మంది పిల్లల్లో మాత్రం ఎక్కువ రోజుల పాటు లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఈ అధ్యయనంలో భాగంగా ఆ పిల్లల గురించి, వారి కుటుంబాల గురించి తాము పూర్తిగా స్టడీ చేశామని ఆమె తెలిపారు.

ఈ అధ్యయనం కోసం ZOE COVID స్టడీ మొబైల్ యాప్ ద్వారా సేకరించిన డేటాను పరిశోధకులు ఉపయోగించారు. ఇందులో భాగంగా బ్రిటన్‌కు చెందిన రెండున్నర లక్షల మంది చిన్నారుల డేటాను వీరు పరిశీలించినట్లు తెలిపారు. వీరిలో ఐదేళ్ల నుంచి పదిహేడు సంవత్సరాల వయసు వరకు ఉన్న చిన్నారులు ఉన్నారు. ఈ యాప్ ద్వారా చిన్నారులకు ఉన్న లక్షణాలను వారి తల్లిదండ్రులు లేదా కేర్ టేకర్లు నిపుణులకు అందించారు. అయితే, ఇందులో వారు స్కూల్‌కి వెళ్లారా? లేదా? అన్న విషయాలను మాత్రం పరిగణనంలోకి తీసుకోలేదు.

2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 ఫిబ్రవరి 22 వరకు చిన్నారుల వివరాలను తీసుకుంటే రెండున్నర లక్షల మందిలో కేవలం 1734 మంది కరోనాతో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వారు ఆరోగ్యంగా మారేవరకు వారికి ఉన్న లక్షణాలన్నింటినీ ఈ యాప్‌లో పొందుపర్చారు. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే వీరిలో చాలామంది సగటున ఆరు రోజుల పాటు కరోనాతో బాధపడ్డారు. వీరందరిలోనూ లక్షణాలు తక్కువగానే ఉండడం విశేషం. అందుకే వీరంతా త్వరగా రికవర్ అయ్యారు.

చాలామంది దాదాపు నాలుగు వారాల సమయంలోపు తిరిగి మామూలుగా మారిపోయారు. నెలకు మంచి లక్షణాలతో బాధపడిన వారి సంఖ్య (77/1,734) చాలా తక్కువగా ఉంది. వారికి కూడా ఒకటి లేదా రెండు లక్షణాలు మాత్రమే అన్ని రోజులు కొనసాగడం విశేషం. ఈ అధ్యయనం ద్వారా పిల్లల్లో కరోనా లక్షణాలు వచ్చినా వారి రోగ నిరోధక శక్తి వేగంగా ప్రతిస్పందిస్తుందని తేలింది.

Read Also…  Flu Vaccine: సాధారణ ఫ్లూ వ్యాక్సిన్ కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుంది..పరిశోధనల్లో వెల్లడి!