MLC Elections Postponed: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా
MLC Elections Postponed: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అవ్వనున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం...
కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో జరపలేమని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అవ్వనున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఏపీలో ఈనెల 31న ముగ్గురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో వచ్చే నెల 3న ఆరుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు.
అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికావస్తున్న సమయంలో అవి ఖాళీకాక ముందే భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను సమీక్షించినట్లుగా పేర్కొంది. కరోనా పరిస్థితి గణనీయంగా మెరుగుపడి ఎన్నికలకు తగిన పరిస్థితులు ఏర్పడేవరకు ఎన్నికలను నిర్వహించడం సరికాదని నిర్ణయించామని ఈసీ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 3తో గడువు ముగియనుంది. పరిస్థితులను బట్టి ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని సీఈసీ ప్రకటించింది.
తెలంగాణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైఎస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, సభ్యులు కడియం శ్రీహరి, ఫరీరుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీ కాలం పూర్తి అవుతుంది. గవర్నర్ కోటాలో భర్తీ అయిన ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్‌రెడ్డి స్థానం కూడా జూన్ 16తో ఖాళీ కానున్నది.
గవర్నర్ కోటా కింద భర్తీ చేసే స్థానానికి రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన వ్యక్తి ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్యే కోటా స్థానాలకు శాసనసభ్యుల ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఎన్నికలు జరిగే తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది.